నవజాతి శిశువు, తల్లి,పిల్లల మరణాలపై శాఖాపరమైన దర్యాప్తు..
1 min read– సంఘటన పూర్వాపరాలపై సీనియర్ వైద్యాధికారితో విచారణ..
– జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో శనివారం సంభవించిన నవజాతి శిశువు మరణం, తల్లి, కవల పిల్లల మరణాలపై శాఖాపరమైన దర్యాప్తుకు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో శనివారం సంభవించిన నవజాతి శిశువు మరణం, తల్లి, కవల పిల్లల మరణాలపై జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా. బి. పాల్ సతీష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శశిధర్ లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నవజాతి శిశువు మరణం, తల్లి, కవల పిల్లల మరణాల సంఘటన పూర్వాపరాలపై సమగ్రంగా సీనియర్ వైద్యాధికారితో విచారణ నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శశిధర్ ఈ సంఘనలకు సంబంధించి వివరాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు తెలియజేస్తూ, 29 సంవత్సరాల వయస్సు గల ఎన్ . అలేఖ్య నవంబర్,2వ తేదీన ఆసుపత్రిలో ప్రసవానికి అడ్మిట్ అయ్యారని, ఆమె రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పరిశీలించి, 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసవానికి ఇంజక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. CTG మిషన్ ద్వారా శిశువు గుండె వేగాన్ని పర్యవేక్షణలో ఉంచి సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడం జరిగిందన్నారు. ఔట్లెట్ ఫోర్ సెప్స్ ద్వారా వైద్యులు సాధారణ ప్రసవానికి ప్రయత్నించారని, కానీ సఫలం కాకపోవడంతో ఆపరేషన్ కోసం ప్రారంభించగా, అనంతరం శిశువు తలా ప్రసవానికి సిద్ధంగా ఉండడంతో సాధారణ ప్రసవం జరిగిందన్నారు. శిశువు శ్వాసకు ఇబ్బందితో ఆరోగ్యం కుంటుపడినట్లు ఎస్. ఎన్ .సి.యూ. మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ గుర్తించి వెంటనే చిన్నపిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఎస్. ఎన్ .సి.యూ. విభాగంలో వెంటిలేషన్ లో చికిత్స అందించడం జరిగిందని, మరింత మెరుగైన చికిత్సకు ఎన్ .ఐ.. సి. యు. తరలించేందుకు సిఫారసు చేశామని, కానీ శిశువు బంధువులు శనివారం ఉదయం 5. 15 ని.లకు ఆశ్రమ ఆసుపత్రికి తీసుకువెళతామని తీసుకువెళ్లారని, ఆశ్రమ ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందిందని, చికిత్స అందించడంలో వైద్యులు, సిబ్బంది సేవలలో ఎటువంటి లోపం లేదని తెలియజేసారు. తల్లి,బిడ్డలా మరణంలకు సంబంధించి వివరణ ఇస్తూ ఏలూరుకు చెందిన 33 వారాల గర్భిణీ శ్రీమతి తిరుమల దేవిని ఈనెల 4వ తేదీ శనివారం తెల్లవారుఝామున 1. 10 ని.లకు అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చారని, ఆమెకు నాడి బలహీనంగా ఉండి, శ్వాస 40 శాతంగా ఉందని, గర్భ శిశువుల గుండె చప్పుడు లేదని గుర్తించడం జరిగిందన్నారు. ఆమెను తీసుకురావడానికి 30 ని.ల ముందు ఫిట్స్ వచ్చాయని , ఆమె బంధువులు తెలియజేసారని, ఆమెకు వెంటనే చికిత్స అందించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తరువాత ఆమెకు మరియొక సారి ఫిట్స్ రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారన్నారు. ఆమెకు అత్యవసర చికిత్స అందించామని, పరిస్థితి విషమించడంతో సి. పి .ఆర్. కూడా చేశామన్నారు. అయినను ఆమె పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని, తదుపరి ఆమె మరణించిందని ధ్రువీకరించడం జరిగిందన్నారు. శ్రీమతి తిరుమల దేవికి చికిత్స అందించడంలో వైద్యులు, సిబ్బంది సేవలలో ఎటువంటి లోపం లేదని డా. శశిధర్ పేర్కొన్నారు.