మాదకద్రవ్యాల నియంత్రణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి
1 min read
మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు చేపట్టండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల,న్యూస్ నేడు: భారత ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టిందని ఈ మేరకు మాదకద్రవ్యాలకు యువత, విద్యార్థులు బానిస కాకుండా సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2024-25 పై సమావేశం నిర్వహించారు. సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయిజ్ ఫాతిమా, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్, డిఈఓ జనార్ధన్ రెడ్డి, డిఐఓ సునీత, ఐసిడిఎస్ పిడి లీలావతి, జువైనల్ హోం సూపరింటెండెంట్ హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ దేశంలో మత్తు పదార్థాల నివారణకు భారత ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని 2020లో ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ మేరకు మాదకద్రవ్యాల నివారణకు సంబంధిత అధికారుల నుండి నివేదికలు సేకరించి పకడ్బందీ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. అదే విధంగా పాఠశాల, కళాశాలలు, విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వ్యసనాలకు బానిసైతే కలిగే దుష్ప్రభావాలపై వీడియోలు ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జన సమూహ ముఖ్య కూడలి ప్రాంతాలలో హోర్డింగులు ఏర్పాటుతో పాటు, వాల్ పోస్టర్లు ప్రదర్శించాలన్నారు. కళాజాత బృందాల ద్వారా మత్తు పదార్థాల నియంత్రణకు అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ కరపత్రాలు కళాశాలలోని ఆడిటోరియం, క్యాంటీన్, లైబ్రరీలలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేసి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల నివారణ కోసం జూన్ 1వ తేది నుండి జూన్ 26వ తేది వరకు సంబంధిత అధికారులు బృందాలుగా వెళ్లి నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టి అవగాహన తీసుకురావాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకుగాను వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని డీఈఓ ను కలెక్టర్ ఆదేశించారు. బలహీన వర్గాల కాలనీల్లో తల్లిదండ్రులు మద్యం సేవిస్తే పిల్లలపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏ మత్తు పదార్థం సేవిస్తే ఎలాంటి దుష్ప్రభావాలు, అనారోగ్యాలు కలుగుతాయో అన్న అంశాలపై అవగాహన తీసుకురావాలన్నారు.అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2024-25లో చేర్చాల్సిన అంశాలపై డిఈఓ, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్, ఐసిడిఎస్ పిడి, జువైనల్ హోం సూపరింటెండెంట్, డిఆర్డిఎ కోఆర్డినేటర్, డిఐఓ, మెప్మా, వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్ కు వివరించారు.