సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం
1 min read-మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ చీర్ల
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, శనివారం స్థానిక ఎంపీడీవో సభ భవనంలో ఎంపీపీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూడు నెలలకు ఒకసారి ప్రజా సమస్యలపై మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే అధికారులు కొంతమంది డుమ్మా కొట్టడం సరికాదన్నారు, అలాగే గత సమావేశంలో సభ్యులు సమావేశం దృష్టికి ఏవైతే సమస్యలు తెచ్చారో వాటిని ఏమాత్రం పరిష్కరించారు అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు, వాడి వేడిగా జరిగిన ఈ సమావేశంలో ఆయన అధికారులపై ఒకింత సహనం వ్యక్తం చేశారు, ముఖ్యంగా నేషనల్ హైవే అధికారులు, రెవిన్యూ అధికారులు ప్రజల పట్ల సక్రమంగా స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, కడప- కర్నూల్ జాతీయ రహదారులకు చెన్నూర్ కొత్త రోడ్డుపై ఇల్లు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు ఇంతవరకు ఎటువంటి స్థలాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు, అంతే కాకుండా అటు అరుంధతి నగర్, ఇటు గాంధీనగర్, కొత్త రోడ్, బెస్థ కాలనీ లలో డ్రైనేజీ సమస్య, సర్వీస్ రోడ్, కొత్త రోడ్డు పైన బస్ షెల్టర్ సమస్యలపై ప్రతి సమావేశంలో చర్చించినప్పటికీ సమస్యలు పరిష్కరించే నాథుడే లేకుంట పోయాడని ఆయన నేషనల్ హైవే అధికారుల తీరుపై బాధపడ్డారు, అలాగే కొత్త రోడ్డు పరిధిలోని కేసీ కెనాల్ ఉప కాలువ లో వ్యర్థాలతో మురికి కాలువను తలపించేలా దుర్వాసన వెదజల్లుతోందని కేసీ కెనాల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు, అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో చెప్పినప్పటికీ కేసీ కెనాల్ అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి కెసి కెనాల్ ఇరువైపులా కంచ నిర్మించాలని కేసీ కెనాల్ అధికారులకు తెలియజేశారు, అదేవిధంగా రామన పల్లెలో త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా పైపులైన్ కొరకు ఎస్టిమేషన్ చేయాలని ఉప సర్పంచ్ పుత్తా వేణుగోపాల్ రెడ్డి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది, త్వరలోనే ఎస్టిమేషన్ వేసి పై అధికారులకు పంపడం జరుగుతుందని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తెలిపారు, రామనపల్లి రెడ్డి వీధి, జెండా చెట్టు దగ్గర కరెంట్ స్తంభం ఒరిగిపోయిందని ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని, ట్రాన్స్కో అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది, అలాగే ఎంపీటీసీ సాధక్ అలీ మాట్లాడుతూ రెండవ అవార్డు అంగన్వాడి కేంద్రం వద్ద కరెంటు స్తంభాలు తీసుకురావడం జరిగిందని కానీ పనులు ప్రారంభించలేదని తెలిపారు, దీనిపై ట్రాన్స్కో అధికారు మాట్లాడుతూ, త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తిచేస్తామని తెలిపారు, ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పరపల్లె లోని గ్రౌండ్లో కంప చెట్లు తొలగించి అక్కడ మొక్కలు నాటాలని ఎంపీటీసీ నిరంజన్ రెడ్డి సమావేశం దృష్టికి తీసుకు రావడం జరిగింది, త్వరలోనే పనులు చేపట్టి పూర్తి చేస్తామని ఉపాధి హామీ ఏపీ డి తెలియజేశారు, సంక్షేమ పథకాల నిమిత్తం, లేదా అభివృద్ధి పనుల నిమిత్తం అధికారులు మండల పరిధిలోని గ్రామాలలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రజాప్రతినిధుల ను కలుపుకొని ఆయా పనులు చేపట్టాలని వారికి ఆ పథకాల గురించి, అభివృద్ధి పనుల గురించి తెలియజేయాలని సమావేశంలో చర్చించారు, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్ మాట్లాడుతూ 15 రోజులైనా ఇంకా శివాలపల్లెలో రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయలేదని అక్కడ ప్రజలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వీఆర్వోలు చొరవ తీసుకొని రేషన్ బియ్యం సకాలంలో ప్రజలకు అందివ్వాలని రెవెన్యూ సిబ్బందికి తెలియజేశారు, వ్యవసాయ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ లో 30% వర్షపాతం నమోదయిందని దీంతో రైతులు మినుము ,జొన్న, పెసర వేసుకోవాలని, అలాగే అంతర పంటగా కంది పంటను పొలం గట్లపైన వేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని ఆమె తెలియజేశారు, 60 టన్నులు యూరియా 30 టన్నులు డి ఏ పి రైతు భరోసా కేంద్ర లలో సిద్ధంగా ఉందని కావలసిన రైతులు తీసుకెళ్లాలని కానీ తెలియజేశారు, వరి, పత్తి, ఉల్లి 995 మంది రైతులకు ఇన్సూరెన్స్ రావడం జరిగిందని ఆమె తెలియజేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులు సీసీ ఆర్ కార్డుల ద్వారా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలియజేశారు, అలాగే వెటర్నరీ డాక్టర్ ఉపేంద్ర మాట్లాడుతూ,పశు నష్టపరిహారం కింద వివిధ ప్రమాదాల కింద మరణించిన పశువులకు సంబంధించి 34 మంది రైతులకు 30 వేల రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు, ఇంకా మిగిలిన రైతులకు కూడా బీమా వర్తిస్తుందని త్వరలోనే వారికి కూడా వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, డిప్యూటీ తాసిల్దార్, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మోహన్ రెడ్డి, సర్పంచులు తుంగ చంద్రశేఖర్ యాదవ్, సొంట్టం నారాయణరెడ్డి, సుదర్శన్ రెడ్డి, చల్లా వెంకటసుబ్బారెడ్డి, ఎంపీటీసీలు నిరంజన్ రెడ్డి, సాధక్ ఆలీ, వెంకటసుబ్బమ్మ, పుష్పలత, కార్యదర్శులు, వీఆర్వోలు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.