ఆదోని అభివృద్ధికి.. ప్రత్యేక విజన్
1 min readపరిశ్రమల ద్వారా జీవనోపాధి కల్పనకు చర్యలు తీసుకోండి
- కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు: ఆదోని ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక విజన్ అవసరం అని, ప్రస్తుతం ఉన్న పథకాల అమలు తో పాటు పెద్ద ఎత్తున జీవనోపాధుల కల్పన కు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు.. గురువారం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్ లో ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృధి కార్యక్రమాల నిర్వహణ పై కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.. జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదోని ప్రాంత అభివృధి కి ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు.. ఆదోని ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉందని, ఈ వెనుకబాటుకు చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక కోణాల్లో కారణాలు కావొచ్చని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి ప్రణాళిక రచించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో నూతన కార్యక్రమాలు, బాల్య వివాహాల నివారణ, పరిశ్రమల స్థాపన పెద్ద ఎత్తున జీవనోపాధుల కల్పన, నీటిపారుదల, మౌలిక వసతుల అభివృద్ధి తదితర కార్యక్రమాల అమలు ద్వారా ఈ వెనుకబాటుతనాన్ని రూపుమాపే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
జీవనోపాధులపై.. ప్రత్యేక దృష్టి..:
నీటిపారుదల రంగ అభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి సారిస్తిందని, సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమల స్థాపన,ఇతర జీవనోపాధుల కల్పనపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఉన్న పథకాలను సంతృప్తి స్థాయిలో అందజేయడం ఒక్కటే సరిపోదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు..
ఆదోని సమీపంలో వెజిటబుల్ సోలార్ డ్రయ్యర్ కు సంబంధించిన గోడౌన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు..మహిళా సమాఖ్య ద్వారా దీనిని నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిఆర్డిఏపీడిని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎకరా భూమిని గుర్తించినట్లు ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కలెక్టర్కు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదోని ప్రాంతంలో నాలుగువేల ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఉల్లి ఈ ప్రాంతంలో పండించే విధంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో మాట్లాడాలని కలెక్టర్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించిన అధికారులను ఆదేశించారు.. రేటు పడిపోయినా ఉల్లి పంటను కొంటామనే నమ్మకాన్ని రైతుల్లో కల్పించాలని, 5000 యూనిట్లకు తగ్గట్లుగా ఉల్లి పంట సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎమ్మిగనూరులో… ఎంఎస్ఎంఈ ఏర్పాటు:
ఎమ్మిగనూరులో జీన్స్ క్లస్టర్ కు సంబంధించిన MSME ని ఏర్పాటు చేయాలని జిఎం డిఐసి ని ఆదేశించారు కనీసం 10 కోట్లతో ఈ ప్రాజెక్టు అమలు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం మెప్మా అధికారుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఆదోని ప్రాంతంలో 11 వేల జీవనోపాధుల యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.. ఇందులో ఇప్పటివరకు 3,000 మందికి పైగా యూనిట్లు ఏర్పాటు చేశారన్నారు.మిగిలిన యూనిట్ల ఏర్పాటుకు కూడా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.. పీఎంఈజిపి,ముద్ర, స్టార్టప్ ఇండియా తదితర పథకాల ద్వారా ఈ యూనిట్ల ఏర్పాటుకు రుణాలిప్పించే బాధ్యత తీసుకోవాలని మెప్మా, డి ఆర్ డి ఏ, ఇండస్ట్రీస్ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.. ఎంసెట్ క్రమం తప్పకుండా సమీక్ష చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సంక్షేమ శాఖ గృహాల్లో పోస్ట్మెట్రిక్ విద్యార్థులకు స్కిల్ కోర్సెస్ నిర్వహించాలని సూచించారు. ఆదోని ప్రాంతంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కూడా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అంతకుముందు ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదోని ప్రాంతంలో ఉన్న పరిస్థితులను, తీసుకుంటున్న చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.