PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీమ  కోసం జగన్ ఏనాడైనా పని చేశావా.!

1 min read

వైసీపీలో  నియోజకవర్గానికి ఒక సైకో…రౌడీయిజం చేస్తే తాట తీస్తా.

ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు….సీమకు నీళ్లు లేకుండా చేసింది జగన్ రెడ్డే.

ముఖ్యమంత్రి కి దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రావాలి…ప్రాజెక్టుల ఘనత మాదే..!

నాలుగేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం….కరెంటు ఛార్జీలు తగ్గిస్తా..

సీమలో చంద్రబాబు కామెంట్స్

పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు:  నాలుగేళ్ల వైసీపీ పాలనలో అన్యాయాలు అక్రమాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక్కో సైకో తయారయ్యాడని ధ్వజమెత్తారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తానని..ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై ‘యుద్దభేరి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు హాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల సందర్శనకు వచ్చిన చంద్రబాబుకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాయలసీమ ప్రాజెక్టుల పర్యటన కోసం నంద్యాల జిల్లా నందికొట్కూరు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. ముందుచూపుతోనే ప్రాజెక్టులను తెలుగుదేశం చేపట్టిందని చంద్రబాబు తెలిపారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కోసం చేపట్టిన ప్రాజెక్టు హంద్రీనీవా అన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించానని ఆయన గుర్తుచేశారు. రాయలసీమ కోసం జగన్ ఏనాడైనా పనిచేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడు అయినప్పటికీ ఈ ప్రాంతం గురించి అసలు పట్టించుకోవడం లేదన్నారు. రాయలసీమకు ద్రోహం చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్‌ అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బటన్‌ నొక్కుతున్నా అని పదేపదే చెబుతున్న వైఎస్ జగన్ బటన్ నొక్కుడు వెనుక బొక్కుడు కూడా ఉందన్నారు. ఈ వైసీపీ పాలనలో బటన్‌ నొక్కడం కాదు.. బటన్‌ బొక్కుడు ఎక్కువైంది అని ధ్వజమెత్తారు. రాయలసీమలో తాము రూ.12,400 కోట్లు ఖర్చుపెట్టామని, రాయలసీమ ద్రోహి ఖర్చుపెట్టింది రూ.2 వేల కోట్లేనన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి ప్రకటించాలని వచ్చానన్నారు. రూ.10 లక్షలకోట్లు అప్పుతెచ్చి.. రాయలసీమకు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదన్నారు. తెలుగుగంగ, ముచ్చుమర్రి ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందని, ఎస్ఆర్‌బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందన్నారు. నీళ్లు లేని ప్రాజెక్టులు చేసిన ఘనత చరిత్రహీనుడు ఈ సీఎంది అన్నారు. నాలుగున్నరేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రోడ్డుకు మట్టి వేయలేరుగానీ  3 రాజధానులు కడతారట అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక రాజధానిని నాశనం చేసి.. 3 రాజధానులంటున్నారన్నారు. మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామన్నారు. పరదాల మాటున కాదు.. ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా జగన్ అని సూచించారు. నందికొట్కూరుకు వచ్చి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా జగన్ తీసుకొచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. తాము రూ.1,200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, భూమి రూ.5 లక్షలకు కొని రూ.60 లక్షలకు అమ్మడమే వీళ్ల పని అని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో నియోజకవర్గానికి ఒక సైకో తయారవుతున్నారని స్ధానిక వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డిని ఉద్దేశించి ఆరోపించారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తానన్నారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పనిచేయని వైసీపీ నాయకులను మురికికాల్వలో ముంచేస్తే బుద్ధి వస్తుందన్నారు. బటన్ నొక్కుతున్నా అని జగన్ పదే పదే చెబుతున్నారని, బటన్ నొక్కడం కాదు, బటన్ బుక్కుడు ఎక్కువైందన్నారు. పైన రూ.10 పంపిస్తారు.. కింద రూ.90 నొక్కుతున్నారన్నారు.విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని, ఇప్పటికే 8 సార్లు పెంచారని చంద్రబాబు ఆరోపించారు. కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే బాధ్యత తనదే అన్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, యువగళం సూపర్ హిట్ అయింది. యువతలో చైతన్యం వచ్చిందన్నారు. 20 లక్షల కంటే ఎక్కువే ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనన్నారు. నాసిరకం మద్యం సరఫరాతో పేదల రక్తం తాగుతున్నారని వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. పాత మద్యం విధానం తెచ్చి ధరలు తగ్గిస్తామన్నారు. నాసిరకం మద్యం నుంచి విముక్తి కలిగిస్తామన్నారు.పర్యటనలో భాగంగా ముచ్చుమర్రి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. ముచ్చుమర్రి ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో రూ.549కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఈ ముచ్చుమర్రికి కేవలం రూ.5కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణ, కాల్వల మరమ్మత్తులకు కూడా కనీసం సీఎం జగన్ నిధులు కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిల ప్రియ, మాజీ ఎమ్మెల్యే లు గౌరు చరిత, భూమా బ్రాహ్మనంద రెడ్డి, మీనాక్షి నాయుడు, కోట్ల సుజాతమ్మ, జయనాగేశ్వర రెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీ.టీ.నాయుడు, నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జి గౌరు వెంకట రెడ్డి,టీడీపీ ఎస్సీ సెల్  రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య, నందికొట్కూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకట స్వామి ,మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author