శిథిలావస్థలో… ఘాట్‌రోడ్డు రక్షణ గోడలు…
1 min readప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులు
మరమ్మతు చేయించాలని కోరుతున్న భక్తులు
పల్లెవెలుగు వెబ్: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదిగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవది గా విరాజిల్లుతున్న శ్రీశైల మహా క్షేత్రానికి ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు నల్లమల్ల అభయారణ్యం ఘాట్ రోడ్డు మార్గాన వస్తుంటారు. ఈ ఘాట్ రోడ్డు కి ఇరువైపులా రక్షణ గోడలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వాహనదారులు తరచు ప్రమాదాలకు గురవుతున్నారు. దోర్నాల – శ్రీశైలం, మన్ననూర్ – శ్రీశైలం మార్గాల్లో రహదారి రక్షణ గోడలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీకి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనం లో డ్యూటీ కి వెళ్లే క్రమంలో లింగాల గట్టు ప్రాంతంలో రహదారి రక్షణ గోడ లేక సుమారు 50 అడుగుల లోయలో పడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రెఫర్ చేశారు. అలాగే తెలంగాణ– ఆంధ్ర ఇరు రాష్ట్రాలను కలిపే వంతెన (పెద్ద బ్రిడ్జి) ఇరువైపులా రక్షణ గోడలు మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇకనైనా ఇరు రాష్ట్రాల అధికారులు స్పందించి శిథిల స్థితికి చేరుకున్న రహదారి రక్షణ గోడలు నిర్మించాలని CPI. AITUC AIYF నాయకులు డిమాండ్ చేశారు.