సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలి
1 min read4,5 తేదీల్లోపు పెన్షన్ పంపిణీ పూర్తి కావాలి
మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లను టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.మంగళవారం ఉదయం పింఛన్ల పంపిణీపై ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పెన్షనర్లు సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవడం వల్ల వారు చాలా ఇబ్బందికి గురి అవుతారు కాబట్టి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో సిబ్బంది సుమారు 7 నుండి 8 మందికి వరకు ఉంటారని,అందులో ఏఎన్ఎంను మినహాయించినా ఆరుగురు సిబ్బంది ఉంటారన్నారు. అదే విధంగా ప్రతి సచివాలయంలో సుమారు నాలుగు వందల వరకు పెన్షనర్లు ఉంటారని, ఆరుగురు సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు 65-70 పెన్షన్లు పంపిణీ రెండు రోజుల్లో పూర్తి చేయవచ్చన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ అయిన వెంటనే సచివాలయ పరిధిలో ఉన్న సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ లు,ఎంపిడివో లను ఆదేశించారు..సచివాలయం సిబ్బందిని క్లస్టర్స్ గా విభజించి, ఆ క్లస్టర్ పరిధిలో ఎంత మంది పెన్షనర్లు ఉన్నారు, ఏ ఇళ్లలో ఉన్నారు ? ఏ డోర్ నంబర్ లో ఉన్నారని సచివాలయం సిబ్బంది ఈ రోజే తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..అదే విధంగా ఇందుకు సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిపై కూడా సచివాలయ సిబ్బంది అవగాహన చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెన్షన్ కు సంబంధించిన నగదు 3 వ తేదీన బ్యాంకు నుండి తీసుకొని, 4, 5 తేదీలలో 90శాతం పైగా పెన్షన్ పంపిణీ చేయాలన్నారు..మిగిలిన వారు ఎవరైనా ఉంటే 6 వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ఈ అంశంపై సాయంత్రం కూడా టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి సచివాలయం వారీగా సచివాలయ సిబ్బందిని పిలిపించి సచివాలయ పరిధిలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ? సచివాలయంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు ? ఒక్కొక్కరికి ఎన్ని క్లస్టర్స్ కేటాయిస్తే ఎంత వరకు పెన్షన్లు పూర్తి అవుతాయి, సంబంధిత యాప్ డౌన్లోడ్ అంశాలపై కలెక్టర్ జిల్లాలోని అందరు మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలను అడిగి తెలుసుకున్నారు..ఈ అంశంపై పూర్తి స్థాయి లో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈఓ, డిఆర్డిఎ పిడి లను ఆదేశించారు.వాలంటీర్ల నుండి మొబైల్ ఫోన్లు, సిమ్స్ అందచేయడానికి సంబందించి, ఇంకా ఎవరైనా అందచేయకపోతే వెంటనే వాటిని తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు ఉపాధి కల్పించడంలో దృష్టి పెట్టాలన్నారు.. రానున్న సంవత్సరంలో డీసిల్టింగ్ పనులు తగ్గించి, ప్లాంటేషన్ మీద దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పిడిని కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికలకు సంబంధించి ఆర్డర్స్ తీసుకుని శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో మొత్తం నాలుగు విడతల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా 134 మంది గైర్హాజరు కావడం జరిగిందన్నారు. వీరిలో ఎన్నికల విధుల నుంచి ఎంత మంది మినహాయింపు పొందారు,, అందుకు తగిన కారణాలతో (మే, జూన్ నెలలో ఎంత మంది పదవీ విరమణ పొందే వారు, అనారోగ్య కారణాల రీత్యా ఎంత మంది, స్థానికంగా లేని వారు ఎంత మంది) వివరాలను సాయంత్రం లోపు తనకు తెలియజేయాలని మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. డిడిఓలు వారి సిబ్బందిని ఎన్నికల విధుల నుంచి మినహాయిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.అదే విధంగా రిటర్నింగ్ అధికారులు వారి ఏరియాలో వాహన వినియోగానికి సంబంధించి నోడల్ ఆఫీసర్స్, ఆర్ఓల సంతకాలతో కూడిన సర్టిఫికేట్ ను ప్రతి సోమవారం అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజ, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిఆర్డిఏ పిడి సలీం భాష, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, ఆదోని మున్సిపల్ కమీషనర్ రామచంద్రారెడ్డి, ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనర్ గంగిరెడ్డి, డిటిసి శ్రీధర్, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.