వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు కిట్లు పంపిణీ
1 min read
మే 31వ తేది వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ
8-14 సం.ల విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత శిక్షణ
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన కిట్లను పంపిణీ చేసామని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ అధికారి ఎం.ఎన్.వి.రాజు, శిక్షకులు, క్యాంపు కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, శాప్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ క్రీడా శిక్షణ శిబిరాల ద్వారా 8 సం.ల నుండి 14 సం.ల చిన్నారులకు ఉచితంగా శిక్షణను ఇచ్చి వారిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు గాను క్రీడా శిక్షణ శిబిరాలకు వాలీబాల్, ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, సాఫ్ట్ బాల్, బాల్ బ్యాట్మెంటన్, యోగ, టైక్వాండో, బాక్సింగ్, కబడి, కోకో, ఆర్చరీ కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రతి శిక్షణా శిబిరానికి 5 వేల విలువ గల క్రీడా కిట్లు, క్యాంపు ఇంఛార్జి కు గౌరవ వేతనం 1500ల రూపాయలు, క్యాంపు నిర్వహణ నిమిత్తం 500 రూపాయలు మొత్తంగా 50 క్రీడా శిక్షణ శిబిరాలకు రూ.3.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ శిక్షణా శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో శిక్షణ తీసుకోవాల్సిన ఆసక్తి గల విద్యార్థినీ, విద్యార్థులు క్రీడా యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.