PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్‌ ను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అత్యంత చురుకుగా వ్యవహరించి పోలింగ్ సజావుగా జరపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్‌ నుండి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న పోలింగ్ సామాగ్రి, తరలి వెళ్తున్న సిబ్బందిని జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ పోలింగ్ విధుల్లో అప్రమత్తంగా ఉండి ఓటింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ తో పాటు అన్ని రకాల ధృవపత్రాలను తీసుకున్నారా, లేదా తదితర వివరాలను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో జంబో బ్యాలెట్ బాక్సులు అమర్చే విధానంతో పాటు పోలింగ్ సిబ్బంది తరలి వెళుతున్న దృశ్యాలను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు.అనంత‌రం క‌లెక్ట‌రేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము నుంచి జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్ల‌ను వారు ప‌ర్య‌వేక్షించారు. అలాగే నోడల్ అధికారులందరూ కంట్రోల్ రూము నుంచి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను కంట్రోలు రూమునుంచి పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ బి. పుల్లయ్య, నోడల్ అధికారులు కంట్రోల్ రూము నుంచి పర్యవేక్షిస్తున్నారు.

About Author