ఆదోని ప్రాంత అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి : జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఆదోని ప్రాంత అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల అమలుకు వ్యవసాయ అనుబంధ శాఖలు సమిష్టి కృషి చేసి అందరికీ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ రబీ ఈ-క్రాప్ బుకింగ్ పూర్తి చేశారని, ఈ-కెవైసి 96 శాతం పూర్తి చేశారన్నారు, నమోదు చేసిన ఈ-కెవైసి వివరాలను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తూ గ్రామ సభలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. వాటికి సంబందించి ఎటువంటి గ్రీవెన్స్ వచ్చినా మార్చి 13వ తేది నుంచి 17 వరకు పరిశీలించి ఫైనల్ లిస్ట్ ను మార్చి 20వ తేదిన రైతు భరోసా కేంద్రాలలో ఉంచడం జరుగుతుందన్నారు. గ్రీవెన్స్ సరైన రీతిలో పరిష్కరించడానికి గాను నిత్యం సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలన్నారు. వారం వారీగా చేయాల్సిన పనులకు ముందుగా సరైన ప్రణాళిక వేసుకోవాలన్నారు. క్రాప్ కాంబినేషన్, ఇంటర్ క్రాపింగ్ పంటలు వేసేలా రైతులలో అవగాహన కల్పించి వాటి ద్వారా ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఆస్కారం ఉంటుందని వారికి తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను గుర్తించి వారి చేత ఇతర రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అందుకు అవసరమైన ఆడియో క్లిప్స్ ని కూడా తయారు చేసేలా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆదోని ప్రాంత అభివృద్ధి కోసం వ్యవసాయ శాఖ చేపడుతున్న ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ సాగుకు అనువుగా లేని భూములలో మైక్రో ఇరిగేషన్ సహకారంతో చిరుధాన్యాలు పండించే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా డబుల్ క్రాపింగ్, ఇంటెన్స్ క్రాపింగ్, మల్టిపుల్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్ ల ద్వారా భూ పునరుద్ధరణ జరిగి పంట సస్యశ్యామలంగా వచ్చే అవకాశం ఉందన్నారు. అదే విధంగా సాగుకు అనువుగా లేని బంజరు భూములలో, బీడు భూములలో చిరుధాన్యాల పెంపకం నిర్వహించేలా వారికి దిశా నిర్దేశం చేయడంతో పాటు, ఉల్లిపంట దిగుబడిని నిల్వ చేసుకునేందుకు బ్యాంబూ యూనిట్ల ఏర్పాటు పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉద్యాన శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ సూచించారు.అనంతరం వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ హౌసింగ్ సంబంధించి స్టేజ్ కన్వర్షన్ మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంచాయతీ రాజ్ కు సంబంధించి పూర్తి అయ్యే భవనాల మీద త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా శాఖకు సంబంధించి పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని డిఈఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులు అందరూ వారి పర్యటనలో పాఠశాల తనిఖీ చేసి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా వారిని ప్రోత్సహించాలన్నారు. అదే విధంగా పదవ తరగతి విద్యార్థులు పరీక్షకు అవసరమయ్యే ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పశు సంవర్థక శాఖకు సంబంధించి పాడి పశువులు, ఫాడర్ రీసెర్చ్ మరియు ప్రొడక్షన్ స్టేషన్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మత్స్య శాఖకు సంబంధించి యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి, సిపిఓ అప్పల కొండ, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, హౌసింగ్ పిడి వెంకట నారాయణ, ఏపీఎంఐపీ పిడి ఉమాదేవి, పశుసంవర్ధక శాఖ అధికారి రామచంద్రయ్య, మత్స్యశాఖ అధికారి శ్యామల తదితరులు పాల్గొన్నారు.