NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా వ్యాప్తంగా సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం..

1 min read

– 532 కేజీల బ్రొమోడయోలిన్ మందు సరఫరా..

– లక్షా 33 వేల ఎకరాల్లో ఎలుకల నిర్మూలన కార్యక్రమం..

– జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై. రామకృష్ణ వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  జిల్లాలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై. రామకృష్ణ తెలిపారు.  బుధవారం దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో ఎలుకల నిర్మూలనకు జరుగుతున్న మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.  జిల్లా వ్యాప్తంగా లక్షా 33 వేల 300 ఎకరాల్లో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టామని రామకృష్ణ తెలిపారు.  ఇందుకోసం 532 కేజీల బ్రొమోడయోలిన్ మందును సరఫరా చేశామన్నారు.  స్ధానికరైతులతో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలుకల నిర్మూలన చేపట్టి పంట దిగుబడిని పెంచుకోవాలని సూచించారు.  రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఎలుకలు పాడుచేయడం వల్ల చాలా నష్టం జరుగుతుందన్నారు.  ఎలుకల నిర్మూలన కార్యక్రమం మూలంగా రైతులు ఎలుకల బారినుంచి ఎకరాకు సుమారు 10 బస్తాల దిగుబడిని రక్షించుకోవచ్చునన్నారు. రైతులు తమ పొలాల్లో ఉన్న ఎలుకల కన్నాల్లో ఎలుకల మందు పొట్లాలు ఉంచి వాటిని నిర్మూలించాలన్నారు.  నిన్న మూసిన ఎలుకల కన్నాల్లో ఈరోజు ఏవైతే తెరుచుకున్నాయో ఆకన్నాల్లో ఆఎలుకలమందు పొట్లాలు ఉంచాలన్నారు. ఎలుకల మందుల తయారీకి నూకలు, నూనె, బ్రొమోడయోలిన్ ఎలుకల మందు కలిపి ఇవ్వడం జరుగుతుందన్నారు. వాటిని జాగ్రత్తగా ఎలుకల కన్నాల్లో ఉంచాలన్నారు. వీరి వెంట వ్యవసాయశాఖ కమీషనరేట్ డిడిఏ జి.సునీత, ఏరువాక డాట్ సెంటర్ కో-ఆర్డినేటర్ టి. సుజాత, వ్యవసాయశాస్త్రవేత్త ఫణి కుమార్,  డిప్యూటీ డైరెక్టర్ వై. సుబ్బారావు, ఎఓ జి. రమేష్, వ్యవసాయశాఖ సహాయకులు, రైతులు ఉన్నారు.

About Author