ఓటిఎస్ పేరుతో బలవంతపు వసూళ్లు చేయొద్దు..!
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: ఓటిఎస్ పేరుతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను వేధిస్తూ బలవంతపు వసూళ్లకు అధికారులు పాల్పడితే ఊరుకోబోమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి. పకీర్ సాహెబ్ హెచ్చరించారు. ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని బొల్లవరం, దామగట్ల గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఓటిఎస్ కు వ్యతిరేకంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఇచ్చిన పాత ఇంటి బకాయిలు కట్టకపోతే పెన్షన్లు తొలగిస్తామని లేకపోతే డ్వాక్రా లో ఉన్న సొమ్ము ఓటిఎస్ లో చెల్లించాలని డ్వాక్రా, రెవెన్యూ, సచివాలయం సిబ్బంది వేధిస్తున్నారని ప్రజలుసీపీఎం నాయకుల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి. పకీర్ సాహెబ్ మాట్లాడుతూ ఓటిఎస్ పేరుతో ప్రజలను భయపెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే పేదల ఉసురు తో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు పేదలకు కట్టించిన పక్కా గృహాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓటిఎస్ పేరుతో పేద ప్రజల నుండి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఎన్నో ఏళ్ళుగా జీవనం సాగిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ కరెంట్ బిల్లులు కడుతూ ఉంటే పేదల ఇళ్లకు కొత్తగా వైసీపీ ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు అంటూ పేదల నుంచి రూ, 10 వేల నుండి 20 వేలు వసూళ్లు చేయాలని ప్రజలపై వత్తిడి చేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఇప్పటికే డ్వాక్రా అక్కాచెల్లెళ్ల అభయ హస్తం డబ్బులు లాగేసుకున్న ఘనుడు ,గ్రామ పంచాయతీ ఖాతాలను ఖాళీ చేసిన అసమర్థ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని వారు విమర్శించారు. తక్షణమే ఓటిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయం ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ఎస్. వెంకటేశ్వర్లు, ఆర్. జయ రాణి, గ్రామస్తులు ఓబులేసు, మహానంది ,చిన్నయ్య , వెంకట స్వామి, శ్యామలమ్మ, కళావతి ,చిట్టెమ్మ, మద్దమ్మ, తదితరులు పాల్గొన్నారు.