కదలకుండా కూర్చోకండి… లావై పోతారు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆఫీసుల్లో పనిచేసే వారు గంటల తరబడి కుర్చిలోనే కూర్చుని పనిచేస్తుంటారు. కుర్చీలో కూర్చుని పనిచేయడం ఒక సౌకర్యంగా భావిస్తుంటాం. కొంతమంది అదొక హోదాగా భావిస్తారు. ఇలా గంటల కొద్దీ కూర్చుని పనిచేయడం వల్ల శారీరక ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు, బరవు పెరగడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అన్నింటికీ మించి నాడీ వ్యవస్థ పై ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. కొవ్వు , బీపీ, మధుమేహం పెరిగిపోయి గుండె జబ్బులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన పద్ధతిలో కూర్చోకుండా ఉంటే ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి ఎముకలు పలుచబడిపోతాయని అంటున్నారు. పక్షవాతం వచ్చే అవకాశం కూడ ఉందంటున్నారు. పర్సులు ప్యాంటు వెనుకా జేబులో పెట్టుకుని కూర్చుంటే.. పర్సు ఒత్తిడి వల్ల నడుం నొప్పి కూడ వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి :
- కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వార పై జబ్బులను దరికి రాకుండా చేయవచ్చని వైద్యనిపుణుల అభిప్రాయం.
- కూర్చునే చోట టేబుల్ మరీ పైకి కాకుండా.. మరీ కిందకు కాకుండా సరైన పద్ధతిలో అమర్చుకోవాలి.
- చేతులపై ఒత్తిడి పడుకుండా.. అవి సేదతీరేలా టేబుల్ పై చేతులు ఉంచుకునేలా టేబుల్ ని అమర్చుకోవాలి.
– కుర్చీ కూడ బాగా ఎత్తులో కాకుండా.. బాగా కిందకి కాకుండా.. కాళ్లు నేలను ఆనించి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. - టేబుల్ మీద ఉండే కంప్యూటర్ బాగా ఎత్తులో కాకుండా.. బాగా కిందికి కాకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మెడ భాగంపై ఒత్తిడి పడే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
- ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోకుండా గంట, అరగంటకు ఒకసారి అటు,ఇటూ తిరుగుతూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఇలాంటి పద్దతులు పాటించడం ద్వార కదలకుండా కూర్చునే వారు చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.