PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంగస్థల కళాకారుల కష్టాలు కనిపించడం లేదా..?

1 min read

టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: సమాజంలో అన్ని రంగాల వారిని ఆదుకుంటున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రంగస్థల కళాకారుల కష్టాలు కనిపించడం లేదా.. ? అని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి ప్రశ్నించారు. అధికారంలోకి రాక ముందు.. మీకు నేనున్నాను… నేను చూస్తున్నాను.. జగన్ అన్న వస్తాడు.. మీ కష్టాలు తీరుస్తాడు అంటూ ఊరించి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపుతున్న ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందని ఆయన విమర్శించారు. ముస్లిం అయినప్పటికీ ఆంజనేయుడి పాత్రలో జీవించి ప్రేక్షకులను అలరించిన కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు అక్బర్ బాషా ఆర్ధికంగా దీన స్థితిలో ఉన్నట్లు తెలుసుకుని హనుమంతరావు చౌదరి స్పందించారు. ఎందరో గొప్ప కళాకారుల సరసన నటించి రాయలసీమకే కాదు.. ముస్లిం వ్యక్తిగా తెలుగు గడ్డకే వన్నె తెచ్చిన అక్బర్ బాషను పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి ఉందంటే.. సామాన్య కళాకారుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. తన వంతుగా వెంటనే స్పందించి కనీస మానవత్వంతో మందులు, ఇతర సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే.. అనారోగ్యంతో ఉన్న కళాకారులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున వైద్య సదుపాయం అందించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఆస్పత్రి ఖర్చులు వెయ్యి దాటితే మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్.. కళాకారులే కాదు సామాన్యులు ఆస్పత్రులకు వెళితే పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రజల కష్టాలు పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో పుట్టగతులుండవని హనుమంతరావు చౌదరి హెచ్చరించారు.

About Author