PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్ణాటక భక్తులను ఆదరిస్తున్నా” అన్న దాతలు”

1 min read

– శ్రీశైలం పాదయాత్రికులకు అన్నదాన కార్యక్రమం
– కన్నడీకుల అభిమానం పొందుతున్న దాతలు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా… ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదాన కార్యక్రమం పై పల్లెవెలుగు ప్రత్యేక కథనం.ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లే భక్తుల సహాయార్థం నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో అడుగడుగున పలువురు దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాతల ఆదరణను చూసి కన్నడిగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది దాతలు మజ్జిగ, అల్పాహారం, కళింగర పండు, అరటిపండు, తాగునీరు అందిస్తున్నారు. నందికొట్కూరు పట్టణ శివారులోని జమ్మిచెట్టు వద్ద ఆత్మకూరు రోడ్డులో పర్టీలైజర్ డీలర్లు చక్రపాణి ఆధ్వర్యంలో ఆన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహిస్తున్నారు. గురువారం కర్ణాటక భక్తులు వేల సంఖ్యలో పట్టణానికి చేరుకోవడంతో వారందరికీ అన్నదానం చేశారు.
ఆడపడుచులకు పసుపు కుంకుమ…
కర్ణాటక ఆడపడుచులకు నంద్యాల కు చెందిన సుబ్బారాయుడు పసుపు కుంకుమ అందజేశారు.
పాదయాత్ర చేస్తూ శ్రీశైలం వెళుతున్న ఆడపడుచులకు జమ్మిచెట్టు ప్రాంతంలో మహిళలకు చీర, గాజులు, పసుపు కుంకుమ ఇచ్చారు. బొట్టు పెట్టి ఆశీర్వదించారు. ప్రతి ఏడాది మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
శ్రీ రాఘవేంద్ర ఏజెన్సీ ఆధ్వర్యంలో…
నందికొట్కూరు పట్టణానికి చెందిన రాఘవేంద్ర ఏజెన్సీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీశైలం కు పాదయాత్ర గా వెళుతున్న వేల మంది కన్నడ భక్తుల కడుపు నింపుతున్నారు. మానవత్వన్ని చాటుకుంటున్నారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు కాలినడకన వెలుతున్న కర్ణాటక భక్తులకు ఆకలి తీర్చేందుకు సొంత డబ్బులతో 2012 నుంచి నందికొట్కూరు మండ్లేము గ్రామం మధ్య జాతీయ రహదారి ప్రక్కన ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమం రాఘవేంద్ర ఏజెన్సీ కుటుంబ సభ్యులు ఎల్ బి.లక్ష్మయ్య, గోపాలకృష్ణ మూర్తి, రవికుమార్, హైదరాబాద్ వాస్తవ్యులు జగదీష్, బెంగుళూరుకు చెందిన ఆదిత్య,జంగారెడ్డిగూడెం కు చెందిన శివప్రసాద్ ల సహాయ సహకారం తో వారి ఆధ్వర్యంలో నే కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారు.ఐదు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.ఉదయం టీ, టిఫిన్ మొదలు కొని రాత్రి 11 వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది .ప్రతి ఏటా 50 వేల మంది పాదయాత్రికులకు అల్పాహారం, భోజనం అందిస్తున్నారు.భోజనం తో పాటు రోజు 150 కేజీల పెరుగు, 150లీటర్ల పాలు అందిస్తున్నారు. నాటి నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నది.దీనితో పాటు కర్ణాటక ఆడపడుచులకు 2వేల మందికి పసుపు కుంకుమ అందిస్తారు.అలాగే 110మందికి చీరలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.సొంత పొలంలో బోరు బావి తవ్వించి కన్నడ భక్తులకు ఉచితంగా తాగునీటిని అందిస్తున్నారు.కన్నడ పాదయాత్రికులకు ఇబ్బందులు కలగకుండా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. శ్రీ సాయిబాబా ట్రస్ట్ కర్నూలు ఆధ్వర్యంలో… శ్రీసాయిబాబా ట్రస్ట్ కర్నూలు వారి సౌజన్యంతో కర్నూలు నగర పాలక సంస్థ ఉద్యోగులు, సాయిబాబా భక్త మండలి సభ్యులు పాదయాత్రికులకు కళింగర పండ్లు పంపిణీ చేశారు. బుధవారం, గురువారం నందికొట్కూరు కు చేరుకున్న కన్నడ భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భక్త మండలి జగదీష్, ప్రవీణ్, కృష్ణ, కుమార్ ,గోపి ,దామోదర్ రెడ్డి ,విజయ్, పరమేష్, తదితరులు ఉన్నారు.ఇలా ఎందరో దాతలు కర్ణాటక పాదయాత్రికులకు ఆహారం, మంచినీరు, మజ్జిగ ,పండ్లు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాదయాత్రికులు సేద తీరేందుకు పలువురు చలువ పందిళ్లు ఏర్పాట్లు చేసి తమ ఔదార్యం చాటుకుంటున్నారు.

About Author