PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాల్య వివాహాలకు బలి కావద్దు..

1 min read

– బాలికలు ధైర్యంగా ముందుకు రండి..

– మీకు అన్ని విధాలుగా సహాయం చేయటానికి  ముందుంటాం..

– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :   ఫేస్ బుక్ ద్వారా  జిల్లా కలెక్టర్ వారికి వచ్చిన సమాచారం మేరకు బాల్యవివాహ చెరనుండి ఒకబాలిక రక్షించబడింది. స్థానిక చెంచుల కాలనీలో బాల్యవివాహానికి పెద్దలు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తగు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా బాలల సంరక్షణ  అధికారి డాక్టర్ సి.హెచ్ సూర్య చక్రవేణి చైల్డ్ హెల్ప్ లైన్ టీమ్ సమన్వయంతో అంగన్వాడీ వర్కర్ సహకారంతో బాలిక ఇంటికి చేరుకొని విచారణ చేశారు.  బాలిక తండ్రి 12సం: క్రితం చనిపోగా,  తల్లి వేరొక వ్యక్తి ని పెళ్లి చేసుకుని వెళ్లిపోగా అప్పటి నుండి బాలిక తన అక్క, అన్నయ్యలతో కలిసి నానమ్మ తాతయ్య ల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. ఈ బాలిక 8వ తరగతి వరకు చదువుతుండగా కూలిపని చేసుకొనే నానమ్మ ,  తాతయ్య ఈ మైనర్ బాలికకు వివాహం చేయాలని సుంకరివారి తోట కు చెందిన అబ్బాయితో నిశ్చతార్ధం చేశారు. మరో   నాలుగు రోజులలో వివాహ తేదీని నిర్ణయిస్తారని తెలియవచ్చింది.  ఈ సమయంలో ఆ బాలిక తనకు తెలిసిన వారి ద్వారా ఫేస్ బుక్ ద్వారా తన సమస్య ను  కలెక్టర్ వారి దృష్టిలో పెడితే తనకు చదువు కోవడానికి అవకాశం వస్తుందని భావించి ఈ సమాచారం చేరవేసింది.  ఈ విషయంపై  జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందిస్తూ బాలిక నానమ్మ , తాతయ్యలకు  కౌన్సెల్లింగ్ నిర్వహించి, బాల్య వివాహా ప్రక్రియను రద్దు చేయాలని డిపిపిఓ ను ఆదేశించారు. అలాగే బాలిక చదువుతున్న స్కూల్ కి వెళ్ళి బాలిక చదువుతున్న తరగతి గురించి అరా తీసి, స్కూల్ కి వెళ్లడానికి అడ్మిషన్లు ఇప్పించి చదువుకోవడానికి కావలసిన అవసరాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేకాకుండా  తన  సొంత ఖర్చుతో  ఆబాలికకు సైకిల్ ,  చదువుకోవడానికి కావలసిన బ్యాగ్, పుస్తకాలు, యూనిఫాం మెదలగునవి అందించారు.   బాగా చదివి, ఉన్నతమైన స్థానం లో ఉండాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆ బాలికకు ధైర్యం చెప్పి జీవితంలో తాను అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో డిసిపిఓ డా: సి.హెచ్ సూర్యచక్రవేణి, సిబ్బంది రాజేష్ , శ్రీకాంత్, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది రాజు, ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు.

About Author