బెదిరింపులకు భయపడం… సెంటు భూమి వదులుకోము..!
1 min read– మా గ్రామ అభివృద్ధి చూసి ఓర్వలేకనే కుట్రలు..
– మా భూములను కాపాడుకుంటాం..
– అధికారుల విచారణలో తెగేసి చెప్పిన గ్రామస్తులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: 40 ఏళ్లుగా అనుభవంలో ఉన్న భూములను ఎవరో బెదిరిస్తే భయపడి వదులుకోవడానికి సిద్ధంగా లేమని వారికి సెంటు భూమిని కూడా ఇచ్చే ప్రసక్తేలేదని విచారణ నిమిత్తం వచ్చిన రెవెన్యూ అధికారులకు పీకే ప్రాగటూరు గ్రామస్తులు తేల్చిచెప్పారు.నది లోతట్టు మునక భూములపై పీకే ప్రాగటూరు గ్రామ పెద్ద మనుషులు మునక భూములు 200 ఏకరాలపై పెత్తనం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కు నెహ్రు నగర్ గ్రామ వైసీపీ నాయకుడు పులేంద్ర నాయుడు మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పగిడ్యాల మండలం పీకే ప్రాగటూరు గ్రామంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. గ్రామంలోని పీర్ల చావిడి రచ్చ కట్ట వద్ద గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామ పెద్దలు సహదేవుడు, ఉసేన్, వెంకటేశ్వర్లు, లక్ష్మన్న లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక కొందరు గ్రామంలో విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు.కృష్ణా నది లోతట్టు మునక భూములు కౌలుకు ఇచ్చి వచ్చిన ఆదాయంతో గ్రామాభివృద్ధికి వెచ్చిస్తున్నామని అధికారులకు వివరించారు. పీకే ప్రాగటూరు శ్రీశైలం జలాశయం నిర్మాణం వలన మునక కు గురైందని , మునక గ్రామంలో ఇసుక మేటలు ఏర్పడిందన్నారు.ఇసుక తిప్పలను 1998 లో చదును చేసుకొని దాదాపు 150 ఎకరాలు మునక భూములను సాగు చేసుకుంటున్నామని వెల్లడించారు.40 ఏళ్లుగా అనుభవంలో ఉన్న భూములను కౌలుకు ఇచ్చి కౌలు ద్వారా వచ్చిన ఆదాయంతో గ్రామ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నామని తెలిపారు.ఇప్పటి వరకు ఆ భూముల కౌలు ద్వారా వచ్చి ఆదాయంతో గ్రామ శివాలయం గుడి అభివృద్ధి కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశామన్నారు.అలాగే గ్రామానికి స్మశాన వాటిక లేకపోవడంతో 0.50 ఎకరా స్థలాన్ని స్మశానం కోసం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాలనీలో మట్టి రహదారులు, చర్చి ప్రహరీ గోడ నిర్మాణం, హంద్రీనీవా కాలువ పై వంతెన నిర్మాణ పనుల కోసం ,పొలాలకు రహదారులు కోసం ఖర్చు చేసినట్లుగా తెలిపారు. ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు , ఆలయ పూజరికి నెలకు రూ. మూడు వేల ప్రకారం జీతాలను ఇస్తున్నామని వెల్లడించారు.గ్రామస్తుల నుంచి సేకరించిన వివరాలను రెవెన్యూ అధికారులు నమోదు చేసుకుని చదివి వినిపించారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రెవిన్యూ అధికార తెలియజేశారు.