రాయల్టీ పేరుతో రాళ్లు కొట్టుకునే ,చేతివృత్తుల వారిని ఇబ్బంది పెట్టకండి
1 min read– మైనింగ్ అధికారులకు శ్రీకాంత్ రెడ్డి ఆదేశం.
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి : రాయల్టీ పేరుతో రాళ్లు కొట్టుకునే వారిని, చేతివృత్తుల వారిని ఇబ్బంది పెట్టొద్దని మైనింగ్ అధికారులకు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. నూతనంగా రాయల్టీ విషయంలో కొన్ని ప్రయివేట్ సంస్థలు రాయల్టీ కట్టాలని చెపుతూ చేతి వృత్తుల వారిపైన, వడ్డెరులపైన, రాళ్లు కొట్టుకునే వారిపైన, సొంతింటి ఇళ్ల నిర్మాణాల నిమిత్తం తీసుకువెళ్లే ఇసుక పైన, పొలాలకు రైతులు తీసుకునే మట్టి తొలుకునే వారిపై ప్రయివేట్ సంస్థ వారు జులుం ప్రదర్శిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాళ్లు కొట్టేవారిపైన, ఇళ్ల నిర్మాణానికి ఇసుకు తోలుకునే వారిపైన జులుం చేసి, బెదిరించడం సరైంది కాదన్నారు. రాయల్టీ వల్ల పెంచిన కంకర, మెటల్ రేట్లను వెంటనే తగ్గించాలని ఆయన స్టోన్ క్రషర్ యజమానులను కోరారు. సామాన్యుడికి ఏ చిన్న కష్టం వచ్చినా తాను తోడుగా నిలుస్తానన్నారు. రాయల్టీ పేరుతో ఇబ్బందులు, ఆటంకాలు కలుగుచేస్తే ప్రజలకు తాను తోడుగా నిలుస్తానన్నారు. మొదటి నుంచి ఇసుక డంప్ చేసి వ్యాపారాలు చేస్తూ, ఇతర జిల్లాలకు తరలించే వారిపై చర్యలు తీసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. సామాన్యుడికి నిత్యం అవసరమయ్యే వాటికి ఆటంకం కల్గిస్తే ప్రజల తరపున నిలబడి అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రాళ్లు కొట్టుకునే సామాన్యులను రాయల్టీ వాళ్ళు ఎక్కడా భయబ్రాంతులకు గురిచేయొద్దని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.