ఇలా చావలేం.. మీరే చంపండి..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన రెండో దశలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. మరోవైపు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కేసుల సంఖ్య పెరగడంతో.. ఆసుపత్రిలో బెడ్లు మొత్తం భర్తీ అవుతున్నాయి. కొత్తగా వచ్చే రోగులకు ఖాళీ బెడ్ల కొరత వేధిస్తోంది. ఆస్పత్రుల బయటే వేచి ఉండాల్సిన దుస్థితి దేశ వ్యాప్తంగా నెలకొంది. మహారాష్ట్రలో అయితే.. ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడం… ఆస్పత్రులు రోగులతో భర్తీ అవడం కారణంగా కొత్త రోగుల పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ఆస్పత్రల్లో బెడ్లు ఖాళీగా ఉండటం లేదు.. ఆక్సిజన్ సిలిండర్ ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయం కోరింది.
ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి..?
మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి తండ్రి కోవిడ్ లక్షణాలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కిషోర్ తన తండ్రిని చంద్రాపూర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ.. అక్కడ అప్పటికే కోవిడ్ సోకిన వారు బెడ్ల కోసం క్యూ లో ఉన్నారు. ఆస్పత్రిలోని బెడ్లన్నీ భర్తీ అయిపోయాయి. దీంతో మరో రెండు, మూడు ఆస్పత్రులకు వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. మరోవైపు అంబులెన్సులోని తండ్రి తీవ్రంగా బాధపడుతున్నాడు. ఆయన బాధను కిషోర్ చూడలేకపోతున్నారు. పక్కనే ఉన్న తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో కూడ కోవిడ్ కేసులు పెరగడంతో.. ఆస్పత్రులన్నీ భర్తీగా ఉన్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో మీడియా ముందు తన బాధను వెళ్లగక్కాడు. తన తండ్రికి వైద్యం అయినా చేయండి. లేకపోతే ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కిషోర్ ఆవేదనలో ప్రస్తుతం కోవిడ రోగుల పరిస్థితి ఎలా ఉంది అనే విషయం అర్థమవుతోంది.