PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్ధుల పట్ల వివక్షత చూపవద్దు.. సమానంగా చూడండి..

1 min read

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన డా: సర్వేపల్లి రాధాకృష్ణన్..

జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమాన్ని జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు.  అనంతరం డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, జిల్లా విద్యాశాఖాదికారి పి. శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొని డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళులు అర్పించారు. అనంతరం గండికోట రాజేష్ శిష్యబృందంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం అందరిని అలరించింది.   ఈ సందర్బంగా జిల్లాస్ధాయిలో ఉత్తమంగా నిలిచిన 20 మంది అవార్డు గ్రహిత ఉపాధ్యాయులను సత్కరించారు.  ఈ సందర్బంగా జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్ధులకు మంచి భోదన అందించడం ద్వారా పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు దోహదపడాలన్నారు.  ఈ సందర్బంగా గురువుల విశిష్టతను ఆమె విశదీకరించారు.  విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి వేలాది కోట్ల రూపాయలతో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి బాటలు వేశారన్నారు.  జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు వెలకట్టలేనివన్నారు.   విద్యార్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారి పట్ల ఎటువంటి వివక్షత చూపకుండా ఆందరిని సమభావంతో చూడాలని హితవు పలికారు.  చిన్నతనంలో ఉపాధ్యాయులు చెప్పినమాటలు నేటికి మనకు గుర్తుంటాయని ఆయన పేర్కొంటూ ఈ సందర్బంగా తన ఉపాధ్యాయులను స్మృతికితెచ్చుకొని వారికి సభాముఖంగా వందనాలు తెలిపారు.  ఈ రోజు తాను ఈస్ధాయిలో ఉన్నానంటే ఆనాటి ఉపాధ్యాయుల ప్రభావమే అన్నారు.  ఇంటిదగ్గర కన్నా తరగతి గదిలోనే పిల్లలు ఎక్కువ సమయం గడుపుతారని ఈ దృష్ట్యా మట్టిని మలిచి ఒక విగ్రహం చేసినట్లు పిల్లలకు నాణ్యమైన ఉత్తమ విద్యనందించి వారు ఉన్నత స్ధానానికి చేరుకునేలా తీర్చిదిద్దాలన్నారు. పేదరికం నుంచి బయటపడేందుకు చదువే ముఖ్యమన్నారు.  ఉపాధ్యాయుడు ఇన్స్పేక్టర్ లాంటి వారని పిల్లలను ప్రశ్నించి వారికొక హింట్ ఇచ్చి దాని పూర్వపరాలను గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల్లో వెతికి గుర్తించడంలో ఉన్నఆనందం ఎక్కడా పొందలేమన్నారు.  ఎంత తరగతి గదుల్లో చెప్పినదానికన్నా ఇటువంటి తరహా బోధన ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చన్నారు. ప్రతిఒక్కరూ తాము చదువుకొన్నవిజ్ఞానాన్ని అర్దమయ్యేటట్లు మిగిలినవారికి పంచాలని ఈ అవకాశం కలిగిన ఉపాధ్యాయులు పిల్లలకు నేర్పంచాలన్నదే తన కోరిక అన్నారు.  ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యాబోధనను రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుతం సమాజంలో పోటీనెదుర్కొనేలా, ఆధునికతకు అనుగుణంగా మన పిల్లలను సుశిక్షితులుగా తయారుచేయడానికి ధృడ సంకల్పంతో ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.  అదే విధంగా పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ డిస్ప్లే లు, ఏర్పాటయ్యాయని అదే విదంగా పాఠశాలలకు స్మార్ట్ టి.విలు, విద్యార్ధులకు ట్యాబ్ లు అందించబడ్డాయన్నారు. దీనిమూలంగా ఇటు ఉపాధ్యాయుల్లో బోధనా సామర్ధ్యం అటు విద్యార్ధులు అభ్యసనా సామర్ధ్యం పెరుగుతుందన్నారు. గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన వంటి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం అమలుచేస్తున్నదన్నారు.  మన దగ్గర ఉన్న యువత ఏదేశంలోనూ లేదని వారినిజాగ్రత్తగా మలిస్తే దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తందన్నారు. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగ వ్యాప్తికి చేసిన సేవలు గురువుయొక్కగొప్పదనాన్ని ఆయన వివరించారు. ఉపాధ్యాయ స్ధాయినుంచి రాష్ట్రపతి స్ధానానికి ఎదిగిన డా. సర్వేపల్లిని ఉపాధ్యాయలోకం మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు.  జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ మన దేశ సంస్కృతి గురువుస్ధానం ఎంతో విశిష్టమైనదని అత్యున్నతమైనదని, గౌరవ ప్రధానమైనదని పేర్కొన్నారు.   ఒకవ్యక్తి అత్యున్నతమైన స్ధానానికి చేరేందుకు విద్య ఎంత దోహదపడుతుందో డా. సర్వేపల్లి జీవితచరిత్రే ఇందుకు నిదర్శనమన్నారు.  గురువును దేవునితో సమానంగా పూజిస్తామని అటువంటి విలువలతో కూడిన ఉపాధ్యాయులు పిల్లలకు నాణ్యమైనవిద్యనందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు.  నాడు-నేడు ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యను అందంచడం జరుగుతుందన్నారు.

About Author