ఆ ఉచ్చులో పడొద్దు.. ప్రశాంత్ కిషోర్ సూచన !
1 min readపల్లెవెలుగువెబ్ : ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిప్పికొట్టారు. ప్రశాంత్ శుక్రవారం చేసిన ట్వీట్‌లో, భారత దేశం కోసం సంగ్రామం 2024లోనే జరుగుతుందని, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు భవిష్యత్తును నిర్ణయించలేవని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని కార్యకర్తల సమావేశంలో మోదీ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో 2017లో గెలిచినందువల్లే 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినట్లు నిపుణులు చెప్పారన్నారు. ఇప్పుడు కూడా తాను దానినే నమ్ముతున్నానని తెలిపారు. దీనిపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ, రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఉండబోదని తెలిపారు. అయ్యగారికి ఈ విషయం తెలుసునన్నారు. అందుకే ఆయన తెలివైన ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఆ ఉచ్చులో పడొద్దని హెచ్చరించారు. మోదీ ప్రతిపక్షల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి.. అయోమయంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు.