ఉచిత పథకాలు వద్దు – ఉపాధి అవకాశాలు కావాలి
1 min readఆటో రంగాన్ని నిర్వీర్యం చేసే ఉచిత బస్సు ప్రయాణ పథక అమలు ఆలోచన విరమించుకోవాలి
పత్తికొండ తాసిల్దార్ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మికుల ధర్నా
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఆటో రంగాన్ని నిర్వీర్యం చేసే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్. క్రిష్ణయ్య , ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి ఎం. రంగన్న ,ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. రాజప్పలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు పత్తికొండ ఆర్ & బి గెస్ట్ హౌస్ నుండి 200 ఆటోలతో అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ నుంచి 250 మంది ఆటో కార్మికులు ప్రదర్శనతో పత్తికొండ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలో భాగంగా ఉచిత పథకాలు (ఉచిత బస్సు ప్రయాణం) అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుందన్నారు. కావున మన రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం అమలు చేయరాదన్నారు. ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతీసే విధంగా ఉన్న ఇలాంటి పథకాలు వద్దంటూ ఏదైనా ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా పత్తికొండ తాలూకా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతీసే విధంగా ఉచిత పథకాలు ప్రవేశపెట్ట రాదంటూ తమరి ద్వారా జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తాసిల్దార్ గారికి మెమోరాండం సమర్పించారు. కావున ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆటో రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రను పాలక ప్రభుత్వాలు విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా డిప్యూటీ కార్యదర్శి మాజీ వార్డు మెంబర్ గుండు బాషా ఏఐటీయూసీ తాలూకా గౌరవ అధ్యక్షులు బి మాదన్న టౌన్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు యం. రమేష్, మాలింగ (ధర్మా) దూదేకొండ, పెద్ద హుల్తి, జూటుర్ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు వుశేని, చంద్ర, నాగరాజు, రవి, సంజీవరాయుడుఆటో యూనియన్ నాయకులు మలగవల్లి రమేష్, అక్రం బాషా, అలీబాబా, మాలిక్ , శీను , పులి ఉచ్ఛన్న,నెట్టేకల్లు పీరా తదితరులు పాల్గొన్నారు.