ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని నవీకరించిన డాక్టర్ రెడ్డీస్
1 min read– అత్యాధునిక సదుపాయాలతో గ్రామ వాసులకు అప్పగింత
పల్లెవెలుగు వెబ్ కొర్లాం (సోంపేట): శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం గ్రామంతో పాటు చుట్టుపక్కల 42 గ్రామాల్లోని 14,213 కుటుంబాలకు చెదిన 53,362 మందికి వైద్యసేలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కలిసి పునర్నిర్మించాయి. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంతో కలిసి నిర్మించిన ఈ కొత్త భవనాన్ని గ్రామవాసులకు శుక్రవారం అప్పగించారు. ప్రాథమిక, అత్యాధునిక వైద్య సదుపాయాలను స్థానికులకు అందించే లక్ష్యంతో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. దీనిద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు.. ముఖ్యంగా ఔట్ పేషెంట్ సేవలు, డయాగ్నస్టిక్ పరీక్షలు, మందులు, అత్యవసర పరిస్థితిలో అందించే సేవలు, రిఫరల్ సేవలు అన్నీ అందుతాయి. ఇప్పటికే 2022 సెప్టెంబర్‌లో పాతర్లపల్లిలో ఒకటి, 2023 మే నెలలో శ్రీకాకుళంలో రెండో ఆరోగ్య కేంద్రాన్ని ఇలా నవీకరించిన తర్వాత డాక్టర్ రెడ్డీస్ సంస్థ శ్రీకాకుళం జిల్లాలో మూడో ఆరోగ్య కేంద్రాన్ని తాజాగా నవీకరించింది. శుక్రవారం నాటి కార్యక్రమంలో సోంపేట ఎంపీపీ ఎన్. దాసు, సోంపేట మండల జడ్పీటీసీ సభ్యురాలు టి.యశోద, కొర్లం గ్రామ సర్పంచ్ ఆర్. గణపతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.