రక్తనాళంలో డ్రిల్లింగ్.. ఆపై స్టెంట్ అమరిక!
1 min read– కాల్షియంతో పూడుకుపోయి, గట్టిబడిన రక్తనాళం
– గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గి ఇబ్బంది
– అత్యాధునికి చికిత్స చేసిన కిమ్స్ సవీరా వైద్యులు
– బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే ఊరట
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: గుండెకు వెళ్లే రక్తనాళాలు కొద్ది మొత్తంలోనే బ్లాక్ అయితే వాటికి స్టెంట్ వేస్తారు. కానీ, రక్తనాళంలో కాల్షియం బాగా పేరుకుపోతే మాత్రం అది బాగా గట్టిగా అయిపోయి స్టెంట్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి అరుదైన సందర్భాల్లో అత్యాధునిక చికిత్సలు అందిస్తేనే రోగికి నయమవుతుంది. అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఇలాంటి అరుదైన చికిత్స చేసి, రోగికి ఊరట కల్పించారు. ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఇన్వేజివ్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎస్. బాలకిషోర్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ బి.ఫల్గుణ్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “శింగనమలకు చెందిన పోతులయ్య (65) ఛాతీ నొప్పి సమస్యతో మా ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు కొన్ని ప్రాథమిక పరీక్షలు చేసిన తర్వాత యాంజియోగ్రామ్ కూడా చేశాం. ఆయనకు గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఎడమవైపు ఉన్న ఒకే ఒక్క రక్తనాళం బాగా పూడుకుపోయింది. అయితే సాధారణ పూడిక కాకుండా, కాల్సిఫికేషన్ (కాల్షియం బాగా మందంగా పేరుకుపోవడం) ఏర్పడింది. దానివల్ల నేరుగా స్టెంట్ వేయడానికి వీలుండదు. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ చేస్తారు. కానీ, ఈ రోగికి ఒకే ఒక్క రక్తనాళం మాత్రమే ఇలా పూడిపోవడంతో దానికి బదులు రోటాబ్లేషన్ అనే అత్యాధునిక పద్ధతిని ఉపయోగించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా రోగి రక్తనాళంలోకి ముందుగా ఒక డ్రిల్లింగ్ మిషన్ లాంటి చిన్న పరికరాన్ని పంపిస్తాం. అది గుండ్రంగా తిరుగుతూ, పేరుకుపోయిన కాల్షియం మొత్తాన్ని అరిగిస్తుంది. దానివల్ల రక్తనాళంలోని కాల్షియం మొత్తం పొడిలా అయిపోతుంది. దాన్ని తీసేసి, ఆ తర్వాత స్టెంట్ వేశాం. దీనివల్ల రోగికి బైపాస్ సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. స్టెంట్ వేసి ఊరట కల్పించగలిగాం. సాధారణ బ్లాక్‌లు అయినా, ఇలాంటి కాల్సిఫికేషన్ అయినా మన రోజువారీ అలవాట్ల వల్లే వస్తాయి. జీవనశైలి మార్పులతో ఈ తరహా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, కొలెస్టరాల్.. ఈ మూడింటినీ పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. దాంతోపాటు ఊబకాయం రాకుండా చూసుకోవాలి, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి. సమతుల ఆహారం తప్పక తీసుకోవాలి, ఆహారంలో పీచు పదార్థాలు తగిన మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి” అని డాక్టర్ బాలకిషోర్, డాక్టర్ ఫల్గుణ్ వివరించారు.