PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో తాగునీటి సమస్య లేకుండా చేస్తా..

1 min read

నీటి సమస్యపై కనీస అవగాహన లేని వైసీపీ నేతలు…

  • 6 గ్యారంటీలతో…20 ఏళ్ల అభివృద్ధి చేస్తా…
  • టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్​
  •  సైకిల్​ భరోసా యాత్రకు.. హారతితో స్వాగతం పలుకుతున్న మహిళలు

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ హామీ ఇచ్చారు. కర్నూలు నగరంలో టీజీ భరత్ మూడో విడత సైకిల్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో తాగునీటి ఎద్దడి వస్తుందని తెలిసినా.. ఈ పాలకులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చేతకాలేదని మండిపడ్డారు.

నన్ను గెలిపిస్తే… నీటి సమస్య రానివ్వను…:

ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికతో తన తండ్రి టీజీ వెంకటేశ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించారని గుర్తుచేశారు. ఆ తరువాత 2014 ఎన్నికలకు ముందు చెక్ డ్యామ్ నిర్మించేందుకు టీజీ వెంకటేశ్‌ జీ.వో తీసుకువచ్చారని.. అయితే ఆయన ఓడిపోయిన తరువాత ఆ జీవోను పక్కనపడేశారని చెప్పారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటిని ఎలా నిల్వ చేసుకోవాలో ఈ నాయకులకు కనీస అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుతం ప్రజలు నీటి కోసం కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. తాను గెలిచి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లలో కర్నూలులో తాగునీటి సమస్యే లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.

సైకిల్​ యాత్రకు… విశేష స్పందన:

రానున్న ఎన్నికల్లో ప్రజలందరికీ తమ సైకిల్ గుర్తు మాత్రమే కనిపించాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్రను చేపట్టినట్లు టీజీ భరత్ తెలిపారు. తమ సైకిల్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. ప్రతిఒక్కరు ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్లిపోతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారని మాకు స్పష్టంగా తెలుస్తుందన్నారు.

6 గ్యారంటీలతో…20 ఏళ్ల అభివృద్ధి…:

మరో రెండు నెలల్లో తమ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రజలందరికీ మేలు చేస్తామన్నారు. కర్నూలుకు ఏమి చేయని ఈ వైసీపీ నేతలు మరోసారి మోసం చేసేందుకు ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కులమత రాజకీయాలు చేయడం తప్ప వారికి వేరే మార్గం లేదని మండిపడ్డారు. కర్నూలులో దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆరు గ్యారంటీలను ఐదేళ్లలో అమలు చేసి.. కర్నూలు ప్రజలకు 20 ఏళ్ల అభివృద్ధి అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సైకిల్ భరోసా యాత్రలో భాగంగా వృద్ధులు, పెద్దలు, మహిళలు, యువతీయువకులను కలిసి సైకిల్ గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని కోరారు. ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

భరోసా యాత్ర… సాగిందిలా…:

ఈ సైకిల్ భరోసా యాత్ర సాయిబాబా టాకీస్ వద్ద ప్రారంభమై.. జిల్లా కోర్టు, కొత్తపేట రైతు బజార్ సెంటర్, శ్రీలక్ష్మీ హైస్కూల్, అంబినిబు పిండి గిర్నీ, ఎన్‌ఆర్‌ పేట నాయుడు అపార్ట్‌మెంట్స్‌, మదర్ థెరిస్సా సర్కిల్, ప్రకాష్‌ నగర్, రోజా వీధి, రాధాకృష్ణా హస్పిటల్, ధర్మాపేట, అరుంధతి నగర్, ఆర్ఎస్ రోడ్ మీదుగా మౌర్యాఇన్ కాంప్లెక్స్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, వార్డు ఇంఛార్జీలు, బూత్ ఇంఛార్జీలు, భారీ సంఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author