బడేటి సేవా సంస్థ ద్వారా తాగునీరు సరఫరా… : రాధాకృష్ణయ్య
1 min readపల్లెవెలుగు వెబ్,ఏలూరు: తాగునీటి కోసం ఏలూరు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రాధాకృష్ణయ్య (చంటి) ఆవేదన వ్యక్తం చేశారు.వేసవి ప్రారంభంలోనే నగర ప్రజలకు త్రాగు నీరు అందించలేని దుస్థితిలో కార్పొరేషన్ యంత్రాంగం ఉందని ఆరోపించారు.శనివారం బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల గొంతు ఎండుతుందని, దాహం తీర్చుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని కార్పొరేషన్ అధికారులు సరఫరా చేయడం లేదని ద్వజమెత్తారు.తన వద్ద ఉన్న మంచి నీటి ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నానని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు రోజులకు మంచినీటి ట్యాంక్ ను పంపించి అధికారులు చేతులుదులుపుకుంటున్నారని ఆరోపించారు.28వ డివిజన్ బీడీ కాలనీ,4వ డివిజన్ లంబాడి పేట,1వ డివిజన్ నారాయణరావు చెరువుగట్టు, నల్లదిబ్బ,2వ డివిజన్ బావిశెట్టి వారి పేట ప్రాంతాల ప్రజలు దప్పికతో అల్లాడి పోతున్నారని చెప్పారు. కుళాయిల నుంచి నీరు రావడంలేదని, ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆవేదన అర్థం చేసుకొని, ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి ప్రజల తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాగునీటి కోసం ప్రజల పక్షాన తెలుగుదేశంపార్టీపోరాడుతుందని హెచ్చరించారు.