మోటార్ వాహనాలు నడిపేవారికి 18 యేళ్ళు నిండాలి..
1 min read
18 యేళ్ళ వయసు నిండని ఏ ఒక్కరికీ మోటార్ వాహనాలను నడిపే హక్కు చట్టరీత్యా లేదు
ఏలూరు జిల్లా అడిషినల్ ఎస్పీ నక్కా సూర్యచంద్ర రావు
గతంలో వారోత్సవాలు,నేడు మాసోత్సవలుగా మారటానికి కారణం ప్రజల్లో మరింత అవగాహనకే
ఉప రవాణాశాఖ కమిషనర్ షేక్ కరీం
36వ జాతీయ రహదారి భద్రత మాసొత్సవలు ముగింపు
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: 18 ఏళ్ల వయసు నిండని ఏ ఒక్కరికి మోటారు వాహనాలను నడిపే హక్కు చట్టరీత్య లేదని ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు అన్నారు.ఉప రవాణా కమిషనరు వారి కార్యాలయములో శనివారం జరిగిన 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పదవ మరియు ఇంటర్ మీడియట్ చదువుకునే ఎవ్వరికి 18 యేళ్ళ వయసు నిండి ఉండదని, కావున వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయబడదని అన్నారు. మైనర్లు యాక్సిడెంట్ చేసిన యడల వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు. తమ పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే తల్లి తండ్రులు వాహనాలను వారికి ఇవ్వాలని, హెల్మెట్ను, సీట్ బెల్ట్ ను ధరించి మాత్రమే వాహనాలను నడపాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటే అది పిల్లలకు అలవాటుగా మారుతుందన్నారు. ఇప్పటి తల్లిదండ్రులు మొక్కకు కాకుండా చెట్లకు ట్రీ గార్డులు వేస్తున్నాని ఎద్దేవా చేశారు. ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించక పోవడం వలన ప్రమాదాల సమయములో ముందుగా రోడ్డుకు తల తగులుతుందని అన్నారు. ఎన్నారైలు కారు ఎక్కగానే వారు చేసే మొదటి పని సీట్ బెల్ట్ ను పెట్టుకోవడం అని, ఆవిధముగా సీటు బెల్ట్ ధరించడం అలవాటుగా మారిన రోజున ప్రాణ నష్టాన్ని తగ్గించగలుగుతామని అన్నారు. ఇటీవల ఒక మాజీ మంత్రి కార్ యాక్సిడెంట్ కొందరికి తెలిసే ఉంటుందని, హైదరాబాద్ రింగ్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ముందు సీటులో సీటు బెల్టు పెట్టుకుని కూర్చున్న మాజీ మంత్రి బ్రతికారు కానీ వెనుక సీటు బెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్న ఆయన భార్య మరణించారని గుర్తు చేస్తూ సీటు బెల్టు ఆవశ్యకతను సూర్యచంద్ర రావు తెలియచేశారు. తాను తునిలో సి.ఐ. గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయములో ఒక తండ్రి తన పక్క సీటులో కూర్చున్న కూతురిని ఆనందింప చేయడానికి వాహనాలను ఓవర్ టాక్ చేస్తూ అతి వేగముగా కారును నడిపి ఐదుగురు ప్రాణాలు పోవడానికి కారణమైయ్యాడని అన్నారు.ఉప రవాణా కమిషనర్ ఈ కార్యక్రమములో గత 27 ఏళ్లుగా ఒక్క ప్రమాదం కూడా చేయని జిల్లాలోని త్రీ ఆర్టీసీ డ్రైవర్లను, వివిధ విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు మెమొంటోలను అందించి జిల్లా అడిషినల్ ఎస్పీ నక్కా సూర్యచంద్ర రావు మరియు డీటీసీ షేక్ కరీమ్, ఆర్టీవోలు సత్కరించారు. చిత్రలేఖనం మరియు క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచి విద్యార్థులకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమములో ఆర్టీసీ డిఎం వాణి, ఆర్అండ్ బి డి.ఇ. సంఘమిత్ర, రవాణా శాఖ పరిపాలన అధికారులు ఎం.రాము, ఎం.ఆనంద్ కుమార్, వాహన తనిఖీ బి.భీమారావు, జి.ప్రసాదరావు, ఎన్.డి.విఠల్, ఎస్.బి.శేఖర్, ఎస్.జగదీశ్, వై.ఎస్.వి.కళ్యాణి, కృష్ణవేణి, పి.నరేంద్ర బాబు, డి.ప్రజ్ఞ, ట్రాఫిక్ పోలీస్ మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.