డ్రైవర్లు .. జాగ్రత్తగా వాహనాలు నడపాలి
1 min read– మోటారు వెహికిల్ తనిఖీ అధికారి రాజేశ్వర్ రావు
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: డ్రైవర్ల అజాగ్రత్త వల్లే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని రాయచోటి మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర రావు పేర్కొన్నారు.. రోడ్డు భద్రతా పక్షోత్సవాల సందర్భంగా శుక్రవారం స్ధానిక ఆర్టీసీ డిపోలో మేనేజర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ ఇనాయతుల్లా, డాక్టర్ భాస్కర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు ఒత్తిడికి లోనుకాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు చాకచక్యంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా బస్సు డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయని, జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి ప్రయాణికులను గమ్య స్థానానికి చేరువేయాలన్నారు. అలాగే ప్రతి ఒక్క డ్రైవర్ 6 నెలలకు ఒక సారి డాక్టర్ ను సంప్రదించి ఆరోగ్య పరమైన పరిక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ సుబ్బమ్మ, ఎస్టీఐ నాగేంద్రనాయక్, ఎంఎఫ్ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.