కరువు సహాయక చర్యలు చేపట్టాలి టిడిపి ఇన్చార్జి కేఈ. శ్యామ్ కుమార్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఈ సంవత్సరం వర్షాలు రాక వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిని రైతన్నలు తీరని నష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పత్తికొండ టిడిపి ఇన్చార్జి శ్యాం కుమార్ తెలిపారు. గురువారం నియోజకవర్గంలోని గుంటూరు గ్రామంలో కేఈ శ్యాం కుమార్ బృందం వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరువు పరిస్థితులలో నష్టపోయిన రైతులకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ పూర్తవుతున్న వర్షం జాడ కానరాకపోవడంతో ఎంతో పెట్టుబడులు పెట్టి వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ రైతాంగం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే పరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పంట నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు 40000 రూపాయలు పరిహారం చెల్లించాలన్నారు. అలాగే గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడిందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు ఈశ్వరప్ప, గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, విజయ మోహన్ రెడ్డి, మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.