లోన్ యాప్ ఒత్తిడికి.. తాతమనవళ్ల ఆత్మహత్య !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలోని నరసాపురలో దారుణం జరిగింది. నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మణేశ్వరం గ్రామం పరసావారి మెరకకు చెందిన తాతా మనవళ్లు ఆన్‌లైన్ లోన్ యాప్ ఒత్తిడి తట్టుకోలేక బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూరల్ ఎస్సై ప్రియకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగిరెడ్డి రాఘవరావు (73) వ్యవసాయం చేస్తూ, ఆయన మనవడు భోగిరెడ్డి గిరి ప్రసాద్ (26) ప్రైవేటు జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్‌లైన్ లోన్ యాప్ నుంచి కొంత మొత్తం రుణం తీసుకుని కొంతకాలం సక్రమంగానే చెల్లించారు. అనంతరం ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో రుణం చెల్లించడం ఆలస్యమైంది. ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వీరిని ఒత్తిడి చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటంతో వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని రాఘవరావు కుమారుడు, గిరిప్రసాద్‌కు తండ్రి అయిన భోగిరెడ్డి నాగరాజు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. తాతా మనవళ్లు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.