కృష్ణా నదిలో భూకంపం.. ఉలిక్కిపడ్డ జనం
1 min readపల్లెవెలుగు వెబ్ : నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణా నదిలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. శ్రీశైలం జలాశయానికి 44 కిలోమీటర్ల దూరంలో, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తూర్పున 18 కిలో మీటర్ల దూరంలోని కృష్ణానదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు హైదరాబాద్ లోని భూ భౌతిక పరిశోధన సంస్థ వెల్లడించింది. నల్లమల అడవుల్లో 7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్టు గుర్తించింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కొన్నిసెకెన్లపాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలు పై తీవ్రత 3.7గా గుర్తించారు. నల్లమల అటవీప్రాంత పరిసర గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. కొన్ని గ్రామాల్లో మూడు సెకెన్లు, మరికొన్ని గ్రామాల్లో 4 సెకెన్లు భూమి కంపించింది. ఇళ్లల్లోని డబ్బాలు, చిన్న చిన్న వస్తువులు కిందపడ్డాయని స్థానికులు చెప్పారు. ఒక్కసారిగా శబ్దంరావడంతో ఇంటి నుంచి బయటికి వచ్చామని స్థానికులు చెబుతున్నారు.