ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలి
1 min read
పురపాల శాఖ రాజమండ్రి రీజనల్ డైరెక్టర్-కం-అప్పిలేట్ కమిషనర్ నాగ నరసింహారావు
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆస్థి పన్ను వసూళ్ల లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలనీ పురపాలక శాఖ రాజమండ్రి రీజనల్ డైరెక్టర్- కం-అప్పీలేట్ కమిషనర్ నాగ నరసింహారావు మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక గోకుల్ కల్యాణ మండపంలో శుక్రవారం రెవెన్యూ వసూళ్ళు, 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ యుటిలైజేషన్, పాట్ హెూల్స్ ఫ్రీ రోడ్స్, తదితర అంశాలపై మునిసిపల్ కమిషనర్లు, అధికార్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నాగ నరసింహారావు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆస్థి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.నగర, పట్టణాల పరిధిలో ఎక్కడా గుంతలు లేకుండా రోడ్లకు పూర్తి స్థాయిలో మరమ్మత్తు పనులను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్యం కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి, అదే సమయంలో డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. రోడ్లపై ఎక్కడా చెత్త లేకుండా చూడాలన్నారు. పౌర సేవలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పూడిక తీసి, దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అందించే ఫిర్యాదులపై వెంటనే పరిష్కార చర్యలు ఉండాలన్నారు. వీధి దీపాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎ.భాను ప్రతాప్, కమిషనర్, అడిషనల్ కమీషనర్లు జి.చంద్రయ్య, టి. పావని, చింతలపూడి మున్సిపల్ కమిషనర్, కె. వెంకటరమణ, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్, వెంకటరామి రెడ్డి, నూజివీడు మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
