ఏలూరు జిల్లాను నాటుసారా రహితంగా ఉంచేందుకు కృషి చేయాలి
1 min read
నాటుసారా తయారీ సమాచార0 పై టోల్ ఫ్రీ నెం:14405 ను విస్తృతంగా ప్రాచుర్యం చేయాలి
నవోదయం 2.0 అమలు చేయాలని జిల్లాస్ధాయి సమీక్షా కమిటీ సమావేశం
కలెక్టర్ కె. వెట్రిసెల్వి,ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్
సంబంధిత శాఖల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నాటుసారా రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను ఉంచేందుకు సంబంధిత శాఖల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలనా కార్యక్రమం “నవోదయం 2.0” పై జిల్లాస్దాయి జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ తో కలిసి జిల్లాస్ధాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నవోదయం 2.0 పై అవగాహన కలిగించే కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా నాటుసారా నిర్మూలించడానికి ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా క్షేత్రస్ధాయి సిబ్బంది ఈ కార్యక్రమం సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామ, మండల స్ధాయిలో కమిటీలను నియమించాలన్నారు. నియమించడంతోపాటు వారు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను అవగాహన పరచాలన్నారు. నాటుసారా నిర్మూలనకు గ్రామస్ధాయి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎక్సైజ్, అటవీశాఖ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించుకోవాలన్నారు. నాటుసారా, అక్రమ మద్యం, గంజాయి, తదితర మాదకద్రవ్యాలు, ఏ ఇతర ఎక్సైజ్ నేరాలు గురించి సమాచారం అందించేందుకు నిర్ధేశించిన టోల్ ఫ్రీ నెం. 14405 ను విస్త్రృతంగా ప్రాచుర్యం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ముఖ్య కూడళ్లలో సదరు ఫోన్ నెంబరు అందరికి తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే నెలరోజుల లోపు డివిజన్, గ్రామస్ధాయి సమావేశాలు నిర్వహించుకోవడంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా నాటుసారా వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్ధిక దుష్భభావాలను వివరించాలన్నారు. నాటుసారా సేవించడం వల్ల కలిగే ప్రభావంపై కళాజాతలు ద్వారా ప్రజల్లో విస్త్రృత అవగాహన పెంచాలన్నారు. రెండు నెలలుపాటు నిర్వహించే ఈ కార్యక్రమం అమలుపై అన్ని అనుబంధ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఐడి లిక్కర్ పీడిత గ్రామాల జాబితాను ఎ.బి.సి. కేటగిరి లుగా విభజించడం జరిగిందని, ఎ కేటగిరిలో 29 గ్రామాలు, బి కేటగిరిలో 37 గ్రామాలు, సి కేటగిరిలో 74 గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో నాటుసారా నిర్మూలించి ప్రభుత్వ లక్ష్యం చేరుకునేలా పనిచేయాలన్నారు. ఆ వృత్తి నుండి వారి కుటుంబాలను దూరం చేసి సమాజంలో గౌరవప్రదమైన ఉపాధి మార్గాలను వారికి కల్పించేలా ప్రభుత్వం కల్పించే సంబంధిత రాయితీలను, పధకాలను వారికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 141 మధ్యం దుకాణాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమేరాలను జిల్లా పోలీస్ కార్యాలయం, కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూం కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాటుసారా సరఫరాను పూర్తిగా నిరోధించేందుకు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీపై డ్రోన్ల ద్వారా తనిఖీలు చేసేందుకు డ్రోన్ సమకూర్చాలని చేయాలని సూచించారు. దేవాలయాలు, ఆసుపత్రులు లేదా పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉంటే వాటి సమాచారాన్ని అందజేయాలన్నారు. గతంలో నాటుసారా తయారుచేసే వారి కుటుంబ సభ్యులకు ఎల్డిఎం ఆధ్వర్యంలో బ్యాంకర్ల ద్వారా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమీషనరు బి. శ్రీలత, డిఎఫ్ఓ శుభమ్, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఎక్సైజ్ అసిస్టెంట్ కమీషనరు కె.వి.ఎన్. ప్రభుకుమార్, జిల్లా మద్య నిషేద అబార్కి అధికారి ఎ. ఆవులయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, జెడ్పి సిఇఓ భీమేశ్వరరావు, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, డిఐఇవో ప్రభాకరరావు, ఆర్ఐఓ యోహాన్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి రామ్ కుమార్, కమిటీ సభ్యులు మల్లిపూడి కనకదుర్గాదేవి, పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
