సంక్షోభంలో విద్యుత్.. వేసవిలో ఎలా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో విద్యుత్ కోతలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అసమర్థుడి పాలనలో విద్యుత్ సంక్షోభంలో పడిందన్నారు. 32 నెలల్లో రూ.7 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వం… పల్లెల్లో 12గంటలు, పట్టణాల్లో 6 గంటల చొప్పున కోతలు విధిస్తోందని అన్నారు. శీతాకాలంలోనే కోతలు ఈ స్థాయిలో ఉంటే ఎండా కాలంలో పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవాలని చెప్పారు. ‘‘జాతీయ గ్రిడ్ నుండి విద్యుత్ తీసుకొనే విధానంలో లోపం ఉంది. నేషనల్ గ్రిడ్ పెనాల్టీ వేసింది. ఎన్టీపీసీకి రూ.350కోట్లు బకాయి ఉంది. కనీసం రూ.30 కోట్లు చెల్లిస్తేనే విద్యుత్ ఇస్తామని చెప్పారంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. టీడీపీ పాలనలో విద్యుత్ కోతలు అంటే ఏమిటో తెలియని రాష్ట్రానికి విద్యుత్ బాధలను చూపుతున్న ఘనత సీఎందే. జగన్ అసమర్థ, చేతగాని పాలన వల్ల రాష్ట్రంలో 3,200 మెగా వాట్ల విద్యుత్ కొరత వచ్చింది. ఏప్రిల్‌లో విద్యుత్ కోతలతో పాటు బిల్లులూ పెరిగే అవకాశం ఉంది. కమీషన్లకు కక్కుర్తి పడి బయట రాష్ట్రాల నుంచి ఎంత విద్యుత్ కొన్నారో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని దేవినేని మండిపడ్డారు.