విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి… పి. రామచంద్రయ్య
1 min read
ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య
పత్తికొండ, న్యూస్ నేడు : విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శనివారం పత్తికొండలో చదువుల రామయ్య భవనం నుండి ర్యాలీ చేపట్టి నాలుగు స్తంభాల మండపం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే విద్యుత్ స్మార్ట్ మీటర్లను అమలు చేస్తుందని విమర్శించారు. గత వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు పూనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించి స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేస్తామని చెప్పిన పెద్దమనిషి నేడు అధికారంలోకి వచ్చాక మోడీ ఒత్తిళ్లకు తలొగ్గి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు పూనుకుంటే సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన చేసిందేమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నాలుగు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపడం జరిగిందన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కారుమంచి, జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.