జాతరకు సిద్ధమైన ఎల్లమ్మ తల్లి ఆలయం
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కే ఓ ఆర్ కాలనీలో ఉన్న ప్రసిద్ధిగాంచిన ఎల్లమ్మ తల్లి ఆలయం జాతరకు సిద్ధమైందని ఆలయ నిర్వహకులు తెలిపారు. శనివారం నుండి గ్రామంలో ఎల్లమ్మ తల్లి అన్నగారైన పోతురాజును ఊరేగింపు చేస్తారు ఇది ఆనవాయితీగా కొనసాగుతోంది. మూడు రోజులు పోతురాజు ఊరేగింపు తర్వాత ఆదివారం నాడు ఎల్లమ్మ తల్లి జాతరను నిర్వహిస్తారు. మొలకల పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఎల్లమ్మ తల్లి జాతరను నిర్వహిస్తారు. ఈ దేవతను పొలిమేర దేవతగా, గ్రామ దేవతగా అనాదిగా వెలసిన ఎల్లమ్మ తల్లి జాతర చివరిదిగా ఉంటుందని, ఏడ్చేవాళ్లకు ఎల్లమ్మ జాతర ఉందిలే అనే సామెత ఇక్కడి గ్రామాలలో ప్రసిద్ధి. కోర్కెలు తీర్చే తల్లి, చీడపీడలను పారత్రోలుతుందని, కోర్కెలు తీర్చే కొంగుబంగారం ఎల్లమ్మ తల్లి అని భక్తుల నమ్మకం. ఈ ఎల్లమ్మ తల్లి ఆలయం చుట్టూ దాదాపుగా నాలుగు నుండి ఐదు ఎకరాల విస్తీర్ణం ఉండేదని కాలక్రమమైన ఇప్పుడు ఆక్రమణలకు గురై 1. 26 సెంట్లు మిగిలిందన్నారు. మిగిలిన స్థలానికి దాతల సహకారంతో ప్రహరీ గోడలు నిర్మించడం జరిగిందని, ఇంకా కొంతమంది ఆ గోడలపై దేవతల రూపాలను పెయింటింగ్ వేయడం ఎంతో ఆకర్షణ గా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఇంకా దాతల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేసేందుకు కమిటీ సిద్ధంగా ఉందని, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.