పంచ ప్రాధాన్యాల మేరకు ఉపాధి హామీ పనులు
1 min read
ఉపాధి హామీ పధకం కింద పశువుల తొట్టె నిర్మాణం కొరకు భూమిపూజ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి పంచాయితీ లింగారావుగూడెంలో ఉపాధిహామీ పధకం కింద పశువుల తొట్టె నిర్మాణంకు మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి భూమిపూజ చేశారు. పశువులకు త్రాగునీరు అందించేందుకు ఉపాధిహామీ పధకం ద్వారా రూ. 33 వేలు రూపాయలు అంచనాలతో చేపట్టిన ఈ పనులను వారంలోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పశువుల తొట్టె నిర్మాణం ద్వారా లింగారావుగూడెంలో సుమారు 300 పశువులకు త్రాగునీటి సౌకర్యం కలుగుతుందన్నారు.జిల్లాలో ఉపాధిహామీ పధకం కింద 411 పశువుల నీటి తొట్టెల నిర్మాణాలను చేపట్టాలని గుర్తించామన్నారు. వీటిని 10 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు యంపిడివోలు, ఫ్రోగ్రామ్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పశు సంవర్ధకశాఖ సమన్వయంతో నీటి వసతి వున్న ప్రదేశాల్లో వీటిని నిర్మించడం జరుగుతుందని ఒక్కోక్కటి 6,600 లీటర్ల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డ్వామా పిడి కె. వెంకట సుబ్బారావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, తహశీల్దారు శ్రీనివాస్, దెందులూరు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు కె. రఘురామయ్య తదితరులు ఉన్నారు.