చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించండి
1 min read– చిరు ధాన్యాలలో ఉన్నటువంటి పోషకాహార విలువలతో మెరుగైన ఆరోగ్యం
– జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు.
పల్లెవెలగు వెబ్ కర్నూలు: చిరు ధాన్యాలలో ఉన్నటువంటి పోషకాహార విలువలతో మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ఐసిడిఎస్ ఇంచార్జ్ పిడి ఉమామహేశ్వరి అధ్యక్షతన పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చిరు ధాన్యాల పోషకాహార వంటకాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు తిలకించి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించాలని,చిరు ధాన్యాలలో ఉన్నటువంటి పోషకాహార విలువలతో మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవన ప్రమాణాల స్థాయిని పెంచాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన చిరు దాన్యాల పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించాలని, ప్రతి మండలంలో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలి అని జిల్లా కలెక్టర్ అన్నారు ఐక్యరాజ్య సమితి 2022 -23 ఆర్ధిక సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుదాన్యాల సంవత్సరం గా ప్రకటించిందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మార్చి నెల 20 తారీకు నుండి ఏప్రిల్ 3 వ తారీకు వరకు చిరు దాన్యాల ప్రాధాన్యతను అవగాహన కల్పించడం మరియు ప్రోత్సహించడంలో భాగంగా నేడు మన జిల్లా కేంద్రంలో చిరుధాన్యాలు వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కలెక్టర్ అన్నారు. మనం వాడుతున్న బియ్యం, గోధుమలు ఎక్కువ కార్బోహై డ్రేట్ లు కలిగి ఉండి వెంటనే శరీర భాగాలలో కలిసి ఆకలి వేయడం ఓబిసిటీ, ఉబకాయం వంటివి కలుగుతాయని అన్నారు. అందుకే ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చిరు ధాన్యాల వల్ల త్వరగా ఆకలి వేయదని ఇందులో ఫైబర్ తో పాటు మంచి పోషకాలు ఉంటాయని వీటి ప్రాధాన్యతను ప్రజలలోకి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రధానంగా చిరు ధాన్యాలతో రుచికరమైన ఆహారం తయారీకి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపివోలు, కోఆర్డినేటర్లు, అంగన్వాడి సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.