పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
1 min read– అన్ని సచివాలయా ల్లో RRR (రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్) సెంటర్స్ ను ఏర్పాటు చేసాం..
– వాలంటీర్లకు అద్భుత అవకాశం.. కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలనీ ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకట కృష్ణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ” మేరీ లైఫ్ – మేరా స్వచ్ఛ సహార్ ” కార్యక్రమంలో భాగంగా పర్యావరణ అనుకూల అలవాట్ల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు RRR (రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతీ సచివాలయాల పరిధిలో RRR (రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్) సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లను భాగస్వాములను చేసి, రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ వస్తువులను అత్యధికంగా సేకరించి, RRR సెంటర్ లో అందించిన వాలంటీర్లకు నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఈ నెల 24 వ తేదీన రెడ్యూస్ కార్యక్రమంలో భాగంగా వాడేసిన పాత బట్టల సేకరణ చెయ్యాలని, 25 వ తేదీన రీయూజ్ కార్యక్రమంలో భాగంగా తిరిగి వాడుకోవటానికి ఉపయోగపడే పుస్తకాలు, ఆట బొమ్మలు,పాత ఇంటి పాత్రలు సేకరించాలని, అదేవిధంగా ఈ నెల 26వ తేదీన రీ సైకిలింగ్ కార్యక్రమంలో భాగంగా వాడేసిన పేపర్లు , అట్టలు, ప్లాస్టిక్ కవర్లు సేకరించి RRR సెంటర్ లో ఇవ్వాలన్నారు. ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో అధికంగా కృషి చేసి, ఎక్కువ పరిమాణంలో RRR కేంద్రానికి అందించిన వాలంటీర్లను ఎంపిక చేసి మొదటి బహుమతిగా ముగ్గురు వాలంటీర్లకు 5 వేల రూపాయలు చొప్పున , రెండవ బహుమతిగా ముగ్గురు వాలంటీర్లకు 3 వేలు , మూడవ బహుమతిగా ముగ్గురు వాలంటీర్లకు వెయ్యి రూపాయలు చొప్పున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్, 5వ తేదీన ఏర్పాటు చేసే కార్యక్రమంలో అందించడం జరుగుతుందన్నారు. అంతేకాక ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యే డ్వాక్రా సంఘాల సభ్యుల సహకారంతో అత్యధికంగా RRR వస్తువులను సేకరించి RRR సెంటర్ లో అందించిన రిసోర్స్ పర్సన్స్ కూడా ఎంపిక చేసి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా 10 వేలు, 5 వేలు, 3 వేలు రూపాయలు చొప్పున అందించడం జరుగుతుందని వెంకటకృష్ణ తెలియజేసారు.