అంగన్వాడీ ఉద్యోగులపై ఎస్మా దారుణ చర్య
1 min read– కమలాపురం ప్రజానాయకుడు సత్య సాయినాథ్ శర్మ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : రాష్ట్ర వ్యాప్తంగా హక్కుల సాధనకోసం పోరాటం చేస్తున్న అంగనవాడి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా అమలు చేయడం దారుణ చర్య అని తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురం లో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ అంగనావాడి ఉద్యోగుల కంటే వెయ్యి రూపాయల ఎక్కువ వేతనం ఇస్తామని ఎన్నికలు ముందు ఇచ్చిన హామీని అమలు చేయమని అంగనావాడి ఉద్యోగులు 26 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం హేయకరమైన చర్య గా ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో కనీస వేతనానికి పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులపై ఎస్మా అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. లక్షలాదిమంది మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరేత్తినట్లు కూడా లేకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని అంగన్వాడీ ఉద్యోగులు కోరితే ఎస్మా ప్రయోగిస్తారా అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటువంటి నిరంకుశ నియంతృత్వ విధానాలతో హక్కులను కాలరాసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడం తగదన్నారు. ఎస్మా ప్రయోగించినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించినట్టు కాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ఉద్యమం మరింత తీవ్రతరం దాల్చకముందే ప్రభుత్వం వారి డిమాండ్లు తీర్చాలన్నారు. ఎస్మా ప్రయోగించి ఉద్యమం ఆపలేరన్నారు. అంగనవాడి ఉద్యోగులకు మద్దతుగా ఆందోళన చేయడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.