గుండ్ల కొండ దగ్గర హంద్రీనీవా కు స్లూయిజ్ ఏర్పాటు చేయండి
1 min read
హంద్రీ నీవా పెండింగ్ పనులు పూర్తి చేసి పంటకాల్వల నిర్మాణం చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు
పత్తికొండ, న్యూస్ నేడు: మండలంలో పంట కాలువల నిర్మాణం పూర్తి చేసి 46 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని, హంద్రీనీవా కాలువ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, గుండ్లకొండ దగ్గర స్లుయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ మాచాపురం వరకు సాగునీరు అందించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు హంద్రీ నీవా కాలువ పనుల సమీక్ష కు వచ్చిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కు ఆ పార్టీ జిల్లా నాయకులు బి వీరశేఖర్ మండల కమిటీ సభ్యులు అశోక్,యూసుఫ్ భాష సీనియర్ నాయకులు బజారి లు వినతి పత్రాన్ని అందజేసారు.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మంత్రిగారికి సమస్యను రాతపూర్వకంగా దృష్టికి తెస్తూ దశాబ్దల తరబడి కరువు కు పరిష్కారంగా పోరాడి సాధించుకున్న హంద్రీనీవా సుజల స్రవంతి లక్ష్యం నెరవేరడం లేదని అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ప్రజాప్రతినిదుల నిర్లక్ష్యం,అవగాహన రాహిత్యం వలన మండల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు.హంద్రీనీవా వలన మండలం కు 46 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అయితే మండలం లో ని హంద్రీనీవాకు పంట కాలువల నిర్మాణం లేక ఇప్పటివరకు అధికారికంగా ఒక్క ఎకరాకు కూడా నీరు అందడం లేదన్నారు. ప్రధాన కాలువలలో పోతున్న నీటికి పైపులు వేసుకోవడం ద్వారా, మోటర్ల ద్వారా వేలకు వేల రూపాయల ఖర్చు పెట్టి రైతులు సాగునీరును ఉపయోగియించుకుంటున్నారని వివరించారు. గత ఆరు సంవత్సరాలుగా మండల రైతాంగం, సిపిఎం పార్టీ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి అయినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు పాలకుల పరిస్థితి ఉందని తెలిపారు.