పత్తికొండ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయండి
1 min read
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, హైకోర్టు జడ్జి భానుమతి కి వినతి.
పత్తికొండ, న్యూస్ నేడు: రెవిన్యూ డివిజన్ కేంద్రం అయిన పత్తికొండ లో సబ్ కోర్టు ఏర్పాటుకు సహకరించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రంగస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, సీనియర్ న్యాయవాది సత్యనారాయణ, ఏపీ స్టేట్ బార్ కాన్సిల్ సభ్యులు రవిగువేరా, కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి కర్నూలులో జిల్లా కోర్టులో జరిగిన వర్క్ షాప్ కు హాజరైన ఏపీ రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి కుమారి బిఎస్ భానుమతి ని కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో 3900 పెండింగ్ కేసులు ఉన్నాయన్నారు. ఇపుడు ఆదోని లో ఉన్న సబ్ కోర్టుకు వెళ్ళడం స్థానిక ప్రజలకు, కక్షిదారులకు, న్యాయవాదులకు, పోలీసులకు ఇబ్బందిగా ఉందన్నారు. పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలు కలిపి క్రొత్తగా రెవెన్యూ డివిజన్, పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటు అయ్యాయని, పత్తికొండ లో సబ్ కోర్టు ఏర్పాటు చేస్తే స్థానికంగా అందరికీ ఉపయోగంగా ఉంటుందన్నారు. అలాగే పత్తికొండ కోర్టు జడ్జి భారతి గత నవంబర్ నెలలో పదోన్నతి పై బదిలీ అయ్యారన్నారు. అప్పటి నుంచి ఇన్చార్జి జడ్జీల వల్ల కోర్టు లో కేసుల విచారణ సక్రమంగా సాగడం లేదన్నారు. సబ్ కోర్టు ఏర్పాటు తో పాటు, రెగ్యులర్ జడ్జిని నియమించాలని హై కోర్టు జడ్జికి విజ్ఞప్తి చేశారు. సమస్యలు విన్న జడ్జి సానుకూలంగా స్పందించారు . అనంతరం జిల్లా జడ్జి కబర్ధి ని కలసి వినతి పత్రాలు అందచేసారు.