కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలో ఏర్పాటు రాయలసీమకు ఉరితాడే..
1 min read
కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలి..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి
పల్లెవెలుగు , కర్నూలు: కృష్ణా నది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా, రైతు సంఘాలు భగ్గుమన్నాయి. పట్టసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేటప్పుడు ఆ ప్రాంతానికి శ్రీశైలం ప్రాజెక్టుతో అనుబంధం తెగిపోయినప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డును శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలి. కానీ అధికార పార్టీల కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తుంగలో తొక్కి విజయవాడలో ఏర్పాటు చేయడానికి పూనుకుంటే ఇదేమని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కేసులకు భయపడి నోరుమూసుకుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆరోపిస్తోంది. 2021 లో అప్పటి వైసిపి ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు విజయవాడ వేదికగా కర్నూలులోనే కేఆర్ఎంబి ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేసారని నేడు అదే తెలుగుదేశం పార్టీ అధికార పీఠం ఎక్కగానే మాటమార్చి విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఆ పార్టీ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ నెల 9, 10 తారీఖులలో విజయవాడలో అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సిపిఐ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నాయకత్వంలో అఖిలపక్ష నాయకులు జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడుని కలిసి కేఆర్ఎంబి ని కర్నూలులో ఏర్పాటు చేయకపోతే రాయలసీమకు ఉరితాడు వేసినట్లేనని, వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేఆర్ఎంబి ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రకటనపై బొజ్జా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కృష్ణా నదీ జలాల సక్రమ నీటి పంపిణీకి, కేఆర్ఎంబి న ప్రవేశ పెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్ అమలు కావాలంటే కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం నంద్యాలలో మహాత్మాగాందీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా సంఘాలు, రైతు నాయకులు నిర్వహించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి నీటి హక్కుల వినియోగంలో పాలకుల వైఫల్యం వలన రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టుకు 1562 టిఎంసి ల నీరు వచ్చి చేరితే సాగర్ కు హక్కు వున్న 264 టిఎంసి ల నీరు దిగువకు వదిలి మిగిలిన నీటిని శ్రీశైలం రిజర్వాయర్ లో నిల్వ వుంచాల్సిన ప్రభుత్వం 1200 టిఎంసి ల నీటిని దిగువకు వదిలి శ్రీశైలాన్ని ఎండగట్టి రాయలసీమ గొంతు కోసారని తీవ్రంగా విమర్శించారు. సాగర్ ఆయకట్టుకు ఎన్ని నీళ్ళివ్వాలో అన్ని నీళ్ళను మాత్రమే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని విడుదల చేయాలని చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించి వందలాది టిఎంసి ల నీటిని దిగువకు వదలడం ఏ మేరకు సబబని, చట్టాలను గౌరవించాల్సిన ప్రభత్వమే చట్ట ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ప్రజలు హర్షించరని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని బొజ్జా ప్రశ్నించారు.విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తరలిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ ప్రభుత్వానికి దాసోహపడుతున్నాయని ఇది కేవలం తెలంగాణలో తమ రాజకీయ అస్తిత్వం కోసం ఒక పార్టీ, ఆస్తుల భధ్రత కోసం ఇంకొక పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని ఎండగట్టారు. కృష్ణా జలాలలో సక్రమ నీటి పంపిణీ జరుగాలన్నా, రూల్ కర్వ్ అమలు కావాలన్నా, తెలంగాణా జల దోపిడిని నిలువరించాలన్నా కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని బొజ్జా డిమాండ్ చేశారు. కేఆర్ఎంబి ని న విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ప్రకటనపై రాయలసీమ సమాజం తీవ్ర ఆందోళనకు గురవుతోందని, రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని కర్నూలులో ఏర్పాటు అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.రాయలసీమ ప్రజాప్రతినిధులు కేఆర్ఎంబి ని కర్నూలులో ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కేఆర్ఎంబి ని కర్నూలులో ఏర్పాటుకై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అందులో భాగంగా ఈ నెల 25 న వేలాదిమంది ప్రజలతో నంద్యాల పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని బొజ్జా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేడిసిసి డైరెక్టర్ బెక్కం రామసుబ్బారెడ్డి, మిల్క్ డైరీ డైరెక్టర్ ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ ఆకుమల్ల రహీం, సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, కార్మిక నాయకులు షణ్ముఖరావు, నిమ్మకాయల సుధాకర్, రైతు నాయకులు జయరామిరెడ్డి, కొమ్మా శ్రీహరి, ముక్కమల్ల భాస్కర్ రెడ్డి, నసరుల్లాఖాన్, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, జూపల్లె గోపాల్ రెడ్డి, సౌదాగర్ ఖాసీం మియా, రామ నారాయణ రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి, గాయకులు చిన్న నారాయణ గౌడ్, ప్రజాసమస్యల పోరాట కమిటీ అధ్యక్షులు మహబూబ్ భాష పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.