నంద్యాలలో నిత్య పెళ్లికూతురు
1 min readపల్లెవెలుగువెబ్: నంద్యాలలో నిత్య పెళ్లికూతురి మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ.. ఆస్తి తన పేర రాయకపోతే వదిలేసే మహిళ బండారం బయటపడింది. నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన వై. మేరీ జేసింత అలియాస్ మేరమ్మ కుమార్తె శిరీషకు మొదట అవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన పాణ్యం మల్లికార్జున రెడ్డితో వివాహమైంది. ఆస్తి తన పేరు మీద రాయకపోవడంతో కాపురం చేయకుండా వచ్చేసింది. అతనితో విడాకులు తీసుకోకుండానే మండల కేంద్రం కొత్తపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డిని శిరీష రెండో వివాహం చేసుకుంది. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తనితో విడాకులు తీసుకోకుండా బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి శివరామిరెడ్డి కుమారుడు యు. మహేశ్వర్‌రెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన వివాహం చేసుకుంది. వివాహం కంటే ముందుగా తన కుమార్తె పేరు మీద రూ. 5 లక్షల డిపాజిట్ చేయాలనే తల్లి మేరీ జేసింత సూచన మేరకు శిరీష పేరు మీద ఫిబ్రవరి 1న డిపాజిట్ చేశారు. కానీ పెళ్లి అయిన రెండు నెలలకే తన కుమార్తె పేరు మీద ఆస్తి రాసి ఇవ్వాలని, లేకపోతే సంసారానికి పంపనని తల్లి నిబంధన పెట్టడమే కాకుండా ఇబ్బందులకు గురిచేసింది. అనుమానం వచ్చిన మహేశ్వర్ రెడ్డి.. శిరీష గురించి విచారించగా అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పీ. శ్రీనివాసులు తెలిపారు.