NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బతికే అవకాశం లేకున్నా… బతికించారు

1 min read

14 ఏళ్ల బాలిక‌కు బ‌హుళ అవ‌య‌వాల వైఫ‌ల్యం

జ్వరం, ద‌గ్గు, క‌డుపునొప్పితో ప్రారంభం

క‌ర్నూలు, న్యూస్​ నేడు:   గుంత‌క‌ల్లు ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక‌కు బ‌హుళ అవ‌య‌వాలు విఫ‌ల‌మై, తీవ్ర ప్రాణాపాయంలోకి వెళ్లిపోయింది. ఆమె బ‌తికే అవ‌కాశాలు కేవ‌లం 15 శాతం మాత్రమే మిగిలాయి. అయినా కూడా క‌ర్నూలు కిమ్స్ కడల్స్ కి చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ పీడియాట్రీషియ‌న్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ న‌వీన్ రెడ్డి బృందం అత్యంత నైపుణ్యంతో వైద్యం చేసి, ఆమెను కాపాడింది. ఈ వివ‌రాల‌ను డాక్టర్. న‌వీన్ రెడ్డి మీడియాకు తెలిపారు. “8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆ బాలిక‌కు ముందుగా జ్వరం, ద‌గ్గు, క‌డుపునొప్పి మొద‌ల‌య్యాయి. రెండోరోజే ఆమె ప‌రిస్థితి విష‌మించింది. పిలిచినా ప‌ల‌క‌ట్లేదు. స్థానికంగా ఒక ఆస్పత్రికి తీసుకెళ్లగా బీపీ పూర్తిగా ప‌డిపోయింద‌ని గుర్తించి వెంట‌నే కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి వెళ్లాల‌ని సూచించారు. సాధార‌ణంగా ఆ వ‌య‌సు వారికి 110/70 ఉండాల్సిన బీపీ కాస్తా ఆమెకు కేవ‌లం 60/30 మాత్రమే ఉంది.  గుండె ప‌నితీరు కూడా ప‌డిపోయింది. సాధార‌ణంగా గుండె పనితీరు క‌నీసం 65% ఉండాల్సిన‌ది కేవ‌లం 15% ఉంది. కాలేయం తీవ్రంగా విఫ‌ల‌మైంది, లివర్ పని చేయకపోవడం వల్ల 70కంటే త‌క్కువ ఉండాల్సిన అమ్మోనియా ఏకంగా 813 ఉంది, ఎస్‌జీఓటీ 40లోపు ఉండాల్సిన‌ది 12వేలు ఉంది.దీనితో పాటు కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి, అందువలన 0.9 లోపు ఉండాల్సిన క్రియాటినైన్ ఏకంగా 7కు చేరింది, 20 లోపు ఉండాల్సిన యూరియా 211 ఉంది. వీటన్నిటి వలన ఆమెకు ఊపిరి ఆడ‌ట్లేదు. ఆమెకు మ‌ల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్(ఎంఓడిఎస్) అనే స‌మ‌స్య వ‌చ్చింద‌ని గుర్తించాం. దాంతో ఆమె బ‌తికే అవ‌కాశాలు చాలా త‌క్కువ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. తీవ్రత వల్ల అవయవాలు పనిచేయకుండా విషమ పరిస్థితి తలెత్తింది దాంతో వెంట‌నే చికిత్స ప్రారంభించాం. ముందుగా వెంటిలేట‌ర్ మీద పెట్టి, బీపీ పెంచేందుకు త‌గిన మందులు ఇచ్చాం. ఆమె కిడ్నీ, కాలేయం ప‌నితీరు బాగోక‌పోవ‌డంతో వెంట‌నే డ‌యాల‌సిస్ చేయాల్సి వ‌చ్చింది. కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత‌.. బాలిక‌కు కంటిన్యువ‌స్ కిడ్నీ రీప్లేస్‌మెంట్ థెర‌పీ (సీకేఆర్‌టీ) ప్రారంభించాం. ఇది చాలా అత్యాధునిక‌మైన డ‌యాల‌సిస్ విధానం. ఇలా 72 గంట‌లు చేశాక ప‌రిస్థితి కొంత మెరుగుప‌డింది. త‌ర్వాత సాధార‌ణ డ‌యాల‌సిస్ చేయించాం. ఐసీయూలో ఒక వారం పాటు చికిత్సతో కోలుకున్న త‌ర్వాత వెంటిలేట‌ర్ తీసేశాం. త‌ర్వాత ప‌ది రోజుల్లో శారీర‌కంగా, మాన‌సికంగా కోలుకునేందుకు అవ‌స‌ర‌మైన రీహాబిలిటేష‌న్ చేశాం. కుటుంబ‌స‌భ్యుల మ‌ద్దతుకు తోడు.. న‌ర్సులు కూడా పూర్తిస్థాయిలో సంర‌క్షించ‌డంతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించ‌డానికి సిద్ధమైంది.

ఎంఓడీఎస్.. అత్యంత ప్రమాద‌క‌రం

 మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ (MODS) చిన్న పిల్ల‌ల్లో వ‌స్తే ప‌లు ర‌కాల ఇన్ఫెక్షన్లు వ‌స్తాయి, పోష‌కాహార లోపం, ర‌క్తపోటు త‌గ్గిపోవ‌డం, క్రమంగా అన్ని అవ‌య‌వాలు విఫలం కావ‌డం లాంటివి ఉంటాయి. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక స‌దుపాయాల‌కు తోడు నిపుణులైన వైద్యబృందం ఉండ‌డంతో ఈ స‌మ‌స్యల‌ను అధిగ‌మించడానికి వీలుప‌డింది. ఇలాంటి కేసుల్లో త‌క్షణ స్పంద‌న మరియు పిఐసియు స్పెషలిస్ట్ చాలా అవ‌స‌రం అని డా నవీన్ రెడ్డి ఐసియు ప్రాముఖ్యత గురించి వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *