ప్రతిరోజు మహానందిలో ఎలుగుబంటు ప్రత్యక్షం..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: ప్రతిరోజు మహానంది క్షేత్రంలో ఎలుగుబంటు ప్రత్యక్షం అవుతుంది. దీంతో స్థానికులు మరియు భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. బుధవారం రాత్రి కూడా ఎలుగుబంటి భవాని హోటల్ ముందున్న పాత వివేకానంద పాఠశాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఆసక్తిగా దాన్ని కెమెరాల్లో బంధించుకున్నారు. అది కనిపించడంతో ఈలలు కేకలు వేయడంతో మరలా అటవీ ప్రాంతంలోనికి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం ఇలాగే అటవీ ప్రాంతం నుండి క్షేత్రంలోని జనారాణ్య ప్రాంతంలోనికి వస్తుండడంతో స్థానికులు మరియు దేవస్థానం అధికారులు అటవీ శాఖకు సమాచారాన్ని చేరవేయడంతో దాన్ని బంధించి అడవి ప్రాంతంలో వదిలారు. మరలా మూడు నాలుగు రోజుల నుంచి క్షేత్రంలో నీ సమీప ప్రాంతాల్లో సంచరించు చుండడంతో స్థానికులతో పాటు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం వారు మైకుల ద్వారా భక్తులను స్థానికులను తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది కూడా దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి గురువారం తీసుకొని పోయినట్లు సమాచారం. బుధవారం రాత్రి కూడా మహానందిలోని అటవీశాఖ సిబ్బంది మరియు అధికారులు దీనిపై నిఘా ఉంచినట్లు తెలుస్తుంది. అటవీ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాలు ఎలా ఉంటాయి అనేది తెలియ రావడం లేదు. ఎలుగుబంటి నుంచి ఎలాంటి హాని జరగక ముందే అటవీ శాఖ అధికారులు స్పందించి దానిని బంధించి సుదూర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని భక్తులు మరియు స్థానికులు కోరుతున్నారు.