ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలి
1 min read– జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్ట్ .. ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత శక్తి వెలుగులోకి వస్తుందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నుండి రెండు రోజులపాటు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ సైన్స్ పండగ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ చిన్ననాటి నుండే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతకు సాన పెట్టే విధంగా ఉండాలన్నారు. వినూత్న ఆలోచనలతో సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలన్నారు. గురువుల పైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చిన్ననాటి నుండే విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్ తోనే అది సాధ్యమవుతుందన్నారు. మానవ మనుగడకు సైన్సు ఎంతగానో ఉపయోగ పడుతోందన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విద్యార్థులు పరిశీలించటం అలవాటు చేసుకోవాలని అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని భావి శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చన్నారు. ఏ పి జె అబ్దుల్ కలాం, సర్ సి వి రామన్, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తదితర మహోన్నత వ్యక్తులును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞాన శాస్త్ర అభివృద్దికి కృషిచేస్తోందన్నారు. విద్యార్థులులో సృజనాత్మకను వెలికితీసేందుకు, సైన్స్ పై ఆసక్తిని పెంపొందించేందుకు సైన్స్ ఎక్సిబిషన్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎద్దుల రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్య అంటే కేవలం మార్కుల సాధనే కాదని, జ్ఞానం, నూతన పరిశోధనల పట్ల జిజ్ఞాస పెంచుకోవటమన్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా ఆలోచించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అన్నమయ్య జిల్లానే మొట్టమొదటగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మండలానికి ఐదు చొప్పున 30 మండలాల నుండి 150 ప్రాజెక్టులు వచ్చాయన్నారు. వీటిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు పంపనున్నట్లు చెప్పారు. విద్యార్థినీ విద్యార్థులకు, వారి గైడ్ టీచర్లకు వేరువేరుగా ఉచిత భోజనం, వసతి ఏర్పాటు చేశామన్నారు. సమావేశం అనంతరం విద్యార్థుల ప్రాజెక్టులను డీఈవో ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టుల విశేషాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, లక్కిరెడ్డిపల్లె ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్లు సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,సుగవాసి శ్యామ్ , పిఆర్టియు రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ శ్రీనివాస రాజు, స్కౌట్స్ జిల్లా సెక్రెటరీ మడితాటి నరసింహా రెడ్డి,వైఎస్ఆర్ టీఎఫ్ నేత రెడ్డెప్ప రెడ్డి, సాయి విద్యాసంస్థల డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు జావీద్,అమీర్ తదితరులు పాల్గొన్నారు.