PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంత వాతావరణంలో 10 పరీక్షలకు అందరూ సహకరించాలి

1 min read

– అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ ఐఏఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్యజిల్లాలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు విజయవంతానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్ విద్యాశాఖ చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్ నందలి స్పందన హాలులో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై డీఈవో ఆధ్వర్యంలో చీప్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులతో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి మంచి పేరు తీసుకువచ్చారని, అదేవిధంగా ఈ ఏడాది కూడా ఎలాంటి చిన్న పొరపాటుకు, సంఘటనలకు తావివ్వకుండా పరీక్షలను చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా విజయవంతం చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని డిఈఓకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, వైద్య శాఖ ఏఎన్ఎం తో పాటు విద్యార్థులకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పరీక్షల విజయవంతానికి అందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఈవో పురుషోత్తం మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. గత సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదన్నారు. పరీక్షల నిర్ణీత సమయానికి ముందే అధికారులందరూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా సమయం 15 నిమిషాల ముందు మాత్రమే క్వశ్చన్ పేపర్లను ఓపెన్ చేయాలన్నారు. మాస్ కాపీయింగ్ ప్రోత్సహించరాదని, మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకూడదని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో చెందిన చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author