స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు ,నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నంద్యాల జిల్లాను స్వచ్ఛత జిల్లాగా రూపొందించేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం ఉదయం మహానంది మండలం గాజులపల్లి, అయ్యలూరు గ్రామాలలో, మధ్యాహ్నం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో పాల్గొన్నారు. పాణ్యం మండలం భూపనపాడు గ్రామంలో జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మహానంది మండలం గాజులపల్లి, అయ్యలూరు గ్రామాల్లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా పారిశుద్ధ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ స్థలాలలో ముమ్మర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించారు. కలెక్టర్ తో పాటు అన్ని స్థాయిల అధికారులు, ప్రజలు స్వచ్ఛత కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ, దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. ఈ క్రమంలో ప్రతినెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా నెల కొకటి చొప్పున 12మాసాలకు 12 అంశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఫిబ్రవరి మాసంలో “వనరు-మూల వనరు” అంశంతో స్వచ్ఛ కార్యక్రమాలను పాటిస్తున్నామన్నారు.