ఉపాధి పనులు కల్పించడానికి సర్వం సిద్ధం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: ఉపాధి పనులు కల్పించడానికి సర్వం సిద్ధంగా ఉన్నట్లు నంద్యాల క్లస్టర్ ఏపీడి బాలాజీ నాయక్ బుధవారం పేర్కొన్నారు. మహానంది మండలం తిమ్మాపురం ఎంపీడీవో కార్యాలయం నందు ఉపాధి పనులకు సంబంధించిన గ్రామాల వారీగా పనిచేసే సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపిడి మాట్లాడుతూ కూలీలకు మరియు రైతులకు ఉపయోగపడే విధంగా ఉపాధి పనులను చేయించనున్నట్లు తెలిపారు. ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ పనులు అవసరమో ముందే గుర్తించి వాటిని ఆమోదింప చేయడానికి ఉన్నత అధికారులకు ప్రతిపాదనలను ఇప్పటికే పంపామని మిగిలిపోయిన వాటికి సంబంధించి రైతులు సిబ్బందికి వివరాలు అందజేయాలని సూచించారు. పండ్ల తోటల పెంపకం నకు సంబంధించి ఒక ఎకరాకు నాటుకోవడానికి అనుమతిస్తామని దానిని అభివృద్ధి చేయడానికి కూడా విడతలవారీగా కూలీలతోపాటు కొంత మొత్తాన్ని కూడా అందజేయడం జరుగుతుంది అన్నారు. మల్లె తోట, మునగ, డ్రాగన్ ఫ్రూట్స్, ఇతర కొన్ని పంటలకు ఇలాంటి సౌకర్యం ఉంటుందన్నారు. చెరువులు మరియు రైతులకు సంబంధించి బావుల్లో పూడికతీత పనులు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. పొలాలకు వెళ్లే రహదారుల అభివృద్ధి కూడా ఉపాధి కూలీల ద్వారా చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమీపంలోని సిబ్బందితో కానీ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో కానీ పనులకు సంబంధించి వివరాలు నమోదు చేయించుకోవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మనోహర్ ప్లాంట్ సూపర్వైజర్ వెంకట సుబ్బయ్య ఆయా గ్రామాల సిబ్బంది పాల్గొన్నారు.